వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది.
ఇటీవల జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన గౌడ సామాజికవర్గం సమావేశానికి రాలేదన్న కారణంతో స్థానిక వైకాపా సానుభూతిపరులు సుమారు 15 మంది సోమవారం రాత్రి తన ఇంటి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారని బాధితుడు, తెదేపా కార్యకర్త కొనకళ్ల చెన్నారావు తెలిపారు. ఆక్రమించి ఇంటి ప్రహరీ నిర్మించావంటూ పలుగుతో దాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని వాపోయారు. ప్రహరీ కొంత మేర ధ్వంసమైంది. ఈ సంఘటనపై చెన్నారావు మంగళవారం ఉదయం చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.