దళితుడి పొలం పై కన్నేసిన వైకాపా నాయకులు గ్రామ నడివీధిలోనే బహిరంగంగా ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండలో దళితుడైన రామాంజనేయులు ఆర్టిస్టు, పెయింటర్‌గా పనిచేస్తూనే వ్యవసాయం చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఆయన తండ్రి వీరన్న అదే గ్రామానికి చెందిన నాగన్న గౌడ నుంచి కొన్న 1.5 ఎకరాల్లో ఈసారి కంది వేశారు. పంట కోయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో భూమిపై వైకాపా నాయకుల కన్ను పడి ఇప్పటికే 2, 3 సార్లు రైతును బెదిరించారు. తమకు తెలియకుండా కంది పంట ఎలా కోస్తావంటూ ఆదివారం గ్రామ నడివీధిలో అందరూ చూస్తుండగా కర్రలు, రాళ్లతో రామాం జనేయులుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులు, ఆయన భార్య కలిసి ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఫిర్యాదును పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారంటూ బాధిత దంపతులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు.
అదే గ్రామానికి చెందిన వైకాపా మద్దతు మండలాధ్యక్షుడు నరసింహులు కుమారుడు శివానంద, సర్పంచి శివ, మరో వైకాపా నాయకుడు మోహన్ దాడి చేశారని బాధితుడు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడి రక్తం కారుతుండగానే ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. దాడి చేసినవారూ పోలీసుస్టేషన్లోనే కూర్చున్నారని.. మీపై ఎలా, ఎవరు దాడి చేశారని తమనే ఎదురు ప్రశ్నిస్తున్నాని కంటతడి పెట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదలబోమని కూర్చున్నారు. ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు నచ్చ జెప్పటంతో ఆందోళన విరమించారు.