ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని బయటకి వచ్చాక అక్కడి నుంచే రాజకీయ ప్రకటనలు చేస్తుడడంతో విజయవాడ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దుర్గమ్మ కొండపై రాజకీయ ప్రకటనల మీద ఇక ఆంక్షలు ఉండనున్నాయి. ఆలయం చుట్టుపక్కల రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆలయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అంతే కాదు, ఆలయానికి రాబోతున్న రాజకీయ ప్రముఖులకు సంబంధించి టూర్ షెడ్యూల్ ని కూడా మీడియాకి ఇవ్వకూడదని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. గుడి మెయిన్ గేట్ వద్ద ఫ్లెక్సీలూ, పోస్టర్లూ, బ్యానర్లు లాంటి హడావుడి ఏదీ ఉండకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.
రాజకీయ ఉపన్యాసాలకు ఆలయ ప్రాంగణం వేదికగా ఉండకూడదనే ఉద్దేశంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆలయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం మీద రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు వేదిక కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఆలయ అధికారులు తీసుకున్నా ఈ నిర్ణయానికి కూడా ఇతర రాజకీయ పార్టీలు వాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాలను పక్కన పెట్టేసి చూస్తే ఇది కచ్చితంగా మంచి నిర్ణయమే. ఆలయానికి వచ్చే సాధారణ భక్తులకు కూడా ఈ నిర్ణయం వల్ల మేలే జరుగుతుంది. తిరుమలలో కూడా ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలని ఎప్పటి నుండో చూస్తున్నా, అక్కడి మీడియా అత్యుత్సాహం వలన ఆ నిర్ణయం అమలు కావడం లేదు. మరి దుర్గమ్మ గుడిలో అయినా కఠినంగా వ్యవహరిస్తారో లేదో చూడలి మరి.