బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ‘గజ’మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను నవంబరు 15న కడలూరు, పాంబన్ మధ్య మధ్య తీరం దాటే అవకాశం ఉందని త తెలుస్తోంది. ఆ సమయంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ‘గజ’ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వాసులను భయాందోళన కి గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖలోని ఆర్కే బీచ్, రుషికొండలో కెరటాలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో పర్యాటక శాఖ స్పీడ్ బోట్లను, జల విన్యాసాలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు.
మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కు తిరిగి వస్తున్నారు. దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఏపీలో నేటి నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబరు 14 నుంచి 16 వరకు గజ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబరు 15న మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను తీవ్రరూపం దాల్చి నవంబరు 13, 14 తేదీల్లో తమిళనాడు తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది.