ఆంధ్రప్రదేశ్ కు పెథాయ్ ముప్పు తప్పింది. ఇదే సమయంలో కాసేపు అధికారులను వణికించింది కూడా. నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ – యానాం మధ్య కాట్రేనికోన సమీపంలో తీరం దాటిన తుపాను తన ప్రయాణ దిశను మార్చుకుని తిరిగి సముద్రంలోకి వెళ్లింది. ఈ సమయంలో సర్వత్ర టెన్షన్ వాతావరణం నెలకొనగా, రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తుని సమీపంలో మరోసారి తీరం దాటి, బలహీనపడి, వాయుగుండంగా మారి ఒడిశా వైపు వెళ్లిపోయింది. అయితే సాధారణంగా సముద్రంలో తుఫాన్లు ఏర్పడిన తర్వాత అవి తీర ప్రాంతంలో భూభాగాన్ని తాకుతాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించి బలహీనపడతాయి. కానీ, పెథాయ్ తుఫాను మాత్రం వీటికి భిన్నంగా దిశను మార్చుకుని రెండుసార్లు తీరాన్ని దాటింది. సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని తాకిన పెథాయ్ తుఫాను యానాం- కాకినాడ మధ్య తీరం దాటింది. తీరాన్ని దాటిన తర్వాత దిశను మార్చుకున్న పెథాయ్, తిరిగి సముద్రంలోకి మళ్లింది. మళ్లీ సోమవారం రాత్రి 9 తర్వాత తుని వద్ద రెండో సారి తీరాన్ని తాకి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తవానికి తుఫాను తీరాన్ని దాటి భూభాగం మీదకు వచ్చిన అనంతరం బలహీనపడుతుంది. పెథాయ్ విషయంలోనూ అంతా అలాగే భావించారు. కానీ తీరం దాటి కాసేపటికే దిశను మార్చుకొని యానాం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలహీనపడి సోమవారం సాయంత్రానికి కాకినాడ సమీపంలో కేంద్రీకృతమై ఉంది. తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ సోమవారం రాత్రి తుని వద్ద రెండోసారి తీరాన్ని దాటింది. ఇలా ఒకే తుఫాను రెండుసార్లు భూమిని తాకడం చాలా అరుదుగా జరుగుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పెథాయ్ తీరం దాటిన ప్రాంతంలో సముద్ర తీరం వంపు కలిగి ఉండటం, తుఫాను తన దిశను వేగంగా మార్చుకోవడం వల్ల ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటివి దశాబ్దాల తర్వాత సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబరులో ఉపరితల గాలుల ప్రభావంతో తుఫానులు తీరం దాటిన తర్వాత కూడా దిశ మార్చుకోవడంతో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని వాతావరణశాఖ మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. 70వ దశకంలో ఇలాగే జరిగిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వివరించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే తుఫాను రెండుసార్లు తీరం దాటుతుందని, తాజాగా వచ్చిన పెథాయ్ విషయంలోనూ అలాగే జరిగిందని, దీనికి అక్కడ భౌగోళిక పరిస్థితులు కారణమని తెలుస్తోంది.