Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. అదే సమయంలో పిల్లలు కూడా తల్లిదండ్రులను భయభక్తులతో గౌరవిస్తుంటారు. తల్లితండ్రుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు మాత్రం దారి తప్పి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అయితే అలాంటి పిల్లలు సైతం తల్లిదండ్రులకు తమ తప్పు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ తెలిస్తే భయంతో వణికిపోతారు. అపరాధభావంతో కుచించుకుపోతారు. ముఖ్యంగా ఇంటియజమానిగా ఉండే తండ్రి అంటే పిల్లలకు ఈ భయం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలైతే తండ్రంటే ఇంకాస్త ఎక్కువే భయపడతారు. కానీ ఓ కూతురు మాత్రం దారుణమైన తప్పు చేస్తూ తండ్రికి దొరికిపోయి కూడా ఏ మాత్రం భయపడలేదు. తన తప్పు కారణంగా తండ్రి ప్రాణాలు కోల్పోయినా ఆమెలో పశ్చాత్తాపం కనపడలేదు. నోయిడాలోని అట్టా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
మామూలుగా మన సమాజంలో ఆడపిల్లలు పరాయి మగవాడితో మాట్లాడడమే తప్పుగా భావిస్తుంటారు. అయితే కాలం మారి, మనుషుల ఆలోచనావిధానాల్లో మార్పురావడంతో..అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు కాస్త స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నప్పటికీ… తం డ్రి పక్కన ఉన్నప్పుడు మాత్రం క్లాస్ మేట్స్, స్నేహితులతోనైనా సరే మాట్లాడడానికి అమ్మాయిలు కాస్త ఇబ్బందిపడుతుంటారు. తమ అమ్మాయిలు, అబ్బాయిలతో ఫ్రీగా మాట్లాడడం తండ్రులు కూడా పెద్దగా ఇష్టపడరు. అట్టా గ్రామానికి చెందిన 45 ఏళ్ల విశ్వనాథ్ సాహూ కూడా అందరి తండ్రుల్లాంటివాడే. అల్లారుముద్దుగా పెంచిన కూతురు పద్ధతిగా ఉండాలనే కోరుకునేవాడు. కానీ ఆయన కూతురు పూజ మాత్రం తప్పుదారి పట్టింది. బాయ్ ఫ్రెండ్ ను ఏకంగా తన గదికి పిలిపించుకుంది. 21 ఏళ్ల పూజకు పక్క ఇంటిలో ఉండే 24 ఏళ్ల ధర్మేంద్రతో ఏడాదికాలంగా పరిచయం ఉంది.
ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కూతురు గదిలో ఏదో అలికిడి వినిపించడంతో నిద్ర మత్తులో ఉన్న విశ్వనాథ్ లేచి ఆ గదిలోకి వెళ్లాడు. అక్కడ ఆ సమయంలో పరాయి మగవాడు కనిపించడంతో షాక్ తిన్నాడు. అతడితో గొడవపడ్డాడు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నాడు. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ల కంటపడితే యువతీయువకులు భయంతో వణికిపోతారు. కానీ ధర్మేంద్ర మాత్రం ఏ మాత్రం భయపడలేదు సరికదా… విశ్వనాథ్ తో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయి, ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ కిందికి వస్తూ పట్టుతప్పి మెట్ల పై నుంచి జారి కిందపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ ను వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ విశ్వనాథ్ మృతిచెందాడు. ఆయన భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తన తప్పు కారణంగా తండ్రి చనిపోయినా పూజలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని పోలీసులు తెలిపారు. పూజపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కూతురు చేసిన పనితో భర్త ప్రాణాలు కోల్పోవడం, సమాజంలో పరువు పోవడంతో ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది