Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్ లో చాలా మంది కెప్టెన్లతో కలిసి ఆడాడు. వారందరిలోకి సచిన్ ఎక్కువగా అభిమానించేది మహేంద్రసింగ్ ధోనీని. ధోనీ కెప్టెన్సీ లోనే సచిన్ తన చిరకాల స్వప్నం వరల్డ్ కప్ ను గెలుచుకున్నాడు. ఈ విజయం తర్వాత సచిన్ మాట్లాడుతూ తాను కలిసి ఆడిన కెప్టెన్లందరిలో ధోనీనే అత్యుత్తమమని ప్రశంసలు కురిపించాడు. అప్పుడే కాదు..అనేక సందర్బాల్లో ధోనీ కెప్టెన్సీ తీరును, మైదానంలో అతని ప్రవర్తనను సచిన్ ఎన్నో సందర్భాల్లో పొగిడాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన డెమోక్రసీ ఎలెవన్ పుస్తకంలో కూడా సచిన్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ధోనీతో కలిసి ఆడుతున్నప్పుడు అతడి ఆటతీరు చూస్తే..తనకు తన తండ్రే గుర్తుకొచ్చేవాడని సచిన్ చెప్పినట్టు ఆ పుస్తకంలో ఉంది. తాము తొలిసారి కలిసిన సందర్భం నుంచి మహి తనకు పూర్తిగౌరవమిచ్చాడని సచిన్ తెలిపాడు. గెలుపులో అయినా…ఓటమిలో అయినా..ప్రశాంతంగా ఉండేవాడని, జట్టులోని అందరూ అలానే ఉండాలని కోరుకునేవాడని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఈ విషయంలో ధోనీ తన తండ్రిని తలపించేవాడని సచిన్ అన్నాడు. ధోనీ కెప్టెన్సీలో సచిన్ ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. ఆ సమయంలో వన్డే జట్టులో సచినే సీనియర్ కావడంతో ధోనీతో సహా సహచర ఆటగాళ్లంతా సచిన్ అంటే ఎంతో గౌరవభావంతో ఉండేవారు.ఆటకు సంబంధించిన అనేక విషయాల్లో ధోనీ సచిన్ సలహా తీసుకునేవాడు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించిన సచిన్…. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.