Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఆయన అభిమానులు ముద్దుగా మిష్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగుతున్న సమయంలోనూ ధోనీ కూల్ గానే ఉండేవాడు. ఏ మాత్రం టెన్షన్ పడకుండా మ్యాచ్ పరిస్థితి బేరీజు వేస్తూ ఎన్నోసార్లు భారత్ ను గెలుపుతీరాలకు చేర్చాడు ధోనీ. ఓటమి అంచున ఉన్నప్పటికీ….మైదానంలో కూల్ గానే ఉండడం ధోనీ ప్రత్యేకత. ఇలాంటి వైఖరి వల్లే ఆయన చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించి మంచి ఫినిషర్ గా పేరుతెచ్చుకున్నాడు.
కెప్టెన్ కాకముందూ, ఆ తర్వాతా కూడా దాదాపుగా ధోనీ ఇలానే ప్రశాంతంగా ఉండేవాడు. కానీ కెప్టెన్సీని వీడిన తర్వాత ధోనీలో ఆ కూల్ నెస్ తగ్గినట్టు కనిపిస్తోంది. సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ధోనీ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సురేశ్ రైనా, మనీష్ పాండే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
రైనా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీ మ్యాచ్ పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా గెలుపు అవకాశాలు చేజార్జుకున్నట్టే అని భావించిన ధోనీకి సహచర ఆటగాడు మనీష్ పాండే అప్రమత్తంగా లేకపోవడం కోపాన్ని తెప్పించింది.
19వ ఓవర్ లో మొదటి బంతిని ఎదుర్కొన్న పాండే సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. బంతిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్న ధోనీకి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న పాండే ఎటో దిక్కులు చూస్తూ కనిపించాడు. అది గమనించిన ధోనీ వెంటనే పాండేను ఉద్దేశించి ఓయ్ ఇటు చూడు…ఎటుచూస్తున్నావ్ అంటూ పెద్దగా అరిచేశాడు. ధోనీ అరుపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనం చూస్తుంది ధోనీనేనా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
His anger and then the six…💗 @BCCI @msdhoni @imVkohli pic.twitter.com/at4CIsQdel
— Shivansh Yadav (@ishivd5) February 21, 2018