Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా దాదాపు అన్ని భాషల పరిశ్రమలను వణికిస్తున్న భూతం పైరసి. వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాను పైరసీ చేస్తున్నారు. నిర్మాతల జీవితాలతో ఆడుకుంటున్న పైరసీని ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా సఫలం అవ్వడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇటీవలే విడుదలైన ‘జవాన్’ చిత్రాన్ని ప్రసారం చేయడంతో అంతా అవాక్కయ్యారు. విడుదలై వారం కాకుండానే అప్పుడే ‘జవాన్’ సినిమా బస్సులో ప్రసారం చేస్తే థియేటర్లలో ఎవరైనా చూస్తారా, ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు చాలా సీరియస్ అవుతున్నారు.
ఇటీవలే విడుదలైన ‘జవాన్’ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. తప్పకుండా సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుందని అంతా ఆశించారు. కాని విడుదలైన మొదటి రోజే పైరసీ అవ్వడం, మూడవ రోజే బస్సులో వేయడం జరిగింది. ఈ విషయమై దర్శకుడు రవి మాట్లాడుతూ.. అన్నం పెట్టి గొంతు కోసినట్లుగా ఉందని పైరసీ వల్ల కొన్ని కోట్ల రూపాయలను నిర్మాత నష్ట పోతున్నాడని దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచాన్ని ఎయిడ్స్ కంటే పైరసీ వల్ల ఎక్కువ నాశనం చేస్తుందని, దీనికి నాశనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాజిటివ్ టాక్ వచ్చి నిర్మాతకు లాభాలు వస్తాయని ఆశిస్తున్న సమయంలో ఇలా పైరసీ అవ్వడం వల్ల లాభాల విషయం పక్కన పెడితే నష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఈ పైరసీకి విరుగుడు ఏంటో అర్థం కావడం లేదు.