Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘తొలిప్రేమ’ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న వరుణ్ తేజ్ తన తర్వాత చిత్రాన్ని ‘ఘాజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని తన సన్నిహితులతో కలిసి క్రిష్ నిర్మిస్తున్నాడు. ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలతో ఈ బ్యానర్‌కు మంచి లాభాలు వచ్చాయి. దాంతో ఈసారి వరుణ్ తేజ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు క్రిష్ అండ్ టీం ముందుకు వచ్చారు. ‘ఘాజీ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంకల్ప్ రెడ్డి మరో విభిన్న నేపథ్యంతో కథను సిద్దం చేశాడు. ఆ కథ క్రిష్‌కు విపరీతంగా నచ్చడంతో స్వయంగా వరుణ్ తేజ్‌ను ఒప్పించాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రంలో పాటు ఉండవని, లవ్, ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండబోదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. ‘ఘాజీ’ చిత్రంలో కూడా అస్సలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమాకు విమర్శకుల ప్రశంసలు తప్ప కాసుల పంట పండినది లేదు. దాంతో ఈ చిత్రంపై కూడా అనుమానాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా తీస్తే విమర్శకుల ప్రశంసలు అయితే దక్కుతాయి కాని, కాసులు కురవడం మాత్రం కష్టం అని, ఆ విషయాన్ని గుర్తించి, బడ్జెట్ పెడితే క్రిష్ నిర్మాతగా సక్సెస్ అవుతాడు అంటూ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.