Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. మంచి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయనకు వరుసగా చిత్రాలు ఆఫర్ వచ్చాయి. అయితే ఈయన వాటిని వినియోగించుకోవడంలో విఫలం అయ్యాడు. రానాతో సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే వెంకటేష్‌తో సినిమా చేయాల్సిందిగా స్వయంగా నిర్మాత సురేష్‌బాబు దర్శకుడు తేజను కోరడం జరిగింది. అందుకోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేయాలని, టైటిల్‌గా ఆట నాదే వేటా నాదే అనే టైటిల్‌ను కూడా నిర్ణయించాడు. అయితే ‘ఎన్టీఆర్’ చిత్రంపై ఆశతో ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో వెంకీ సినిమాను పక్కకు నెట్టేశాడు.
వెంకీ సినిమా వద్దనుకున్న కొన్ని రోజులకే ‘ఎన్టీఆర్’ చిత్రం నుండి తేజ తప్పుకున్నాడు, తప్పించారు అని కొందరు అంటున్నారు అది వేరే విషయం లేండి. ఇప్పుడు తేజ చేతిలో సినిమా లేదు. మంచి సక్సెస్ తర్వాత వెంటనే సినిమా చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. కాని తేజ మాత్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుని మంచి అవకాశాలు పోగొట్టుకున్నాడు. నందమూరి వారు, దగ్గుబాటి వారితో సినిమాలు కాదనుకున్న తేజ తాజాగా అక్కినేని వారి గడప తొక్కినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే నాగార్జునకు ఒక కథను తేజ చెప్పాడని, ఆ కథ బాగుందని నాగార్జున అనడం, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందనే పుకార్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే తేజతో సినిమా చేసేంత సాహసం నాగార్జున చేయకపోవచ్చు అంటూ అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. అవకాశాలు లేని తేజకు అక్కినేని నాగార్జున అయినా ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.