తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. రాజకీయ కక్షలు తన నియోజకవర్గంలో ఉండవని తెలిపారు. ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని 2014లో సెంటిమెంట్ వల్ల ఓడిపోయానని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా నాలుగేళ్ల వరకు ప్రభుత్వంపైనా, కేసీఆర్ మీద, వారి కుటుంబ సభ్యుల పైనా ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయను అని ఆయన ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సమస్యలను ఉత్తరాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనలు తిరస్కరిస్తే సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తానని చెప్పారు. చింత ప్రభాకర్ తనను రాజకీయంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడని జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కేసీఆర్‌ను అభినందిస్తానని వ్యాఖ్యానించారు. 17న సంగారెడ్డి నియోజకవర్గంలోని లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తానని వెల్లడించారు.