Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పై అనుసరించాల్సిన కొత్త వ్యూహాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు జాతిని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఈ వైఖరిని వెల్లడించనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షబాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోపే ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా విధానాన్ని ప్రకటించగా…ట్రంప్ మాత్రం ఇన్నాళ్లూ వేచిచూశారు. అఫ్ఘానిస్థాన్ పై వైఖరిని ప్రకటించటానికి ట్రంప్ ఇంత సమయం తీసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ అంశంపై విస్తృత కసరత్తు చేసింది.
ఒబామా విధానంలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లకు మాత్రమే ముఖ్యపాత్ర ఉంది. అయితే ట్రంప్ ప్రకటించనున్న కొత్త విధానంలో భారత్ ను సైతం భాగస్వామిని చేయాలని వైట్ హౌస్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆఫ్ఘన్ పై అమెరికా ప్రకటించే కొత్త వ్యూహం ఆ ఒక్కదేశానికే పరిమితం కాదని, దక్షిణాసియా విధానంగా ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ వ్యాఖ్యానించారు. ట్విన్ టవర్స్ పై విమానాలతో ఆల్ ఖైదా దాడికి దిగిన కొన్ని రోజులకే అమెరికా ఆఫ్ఘనిస్థాన్ పై యుద్ధానికి దిగింది. సెప్టెంబరు 11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చారని ఆరోపిస్తూ తాలిబన్ల నివాస ప్రాంతాలపై దాడి చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టింది. అప్పటినుంచి ఆఫ్ఘాన్ లో అమెరికా అనుకూల ప్రభుత్వమే పాలిస్తోంది.
అయితే ఆ యుద్ధంలో బిన్ లాడెన్ ను పట్టుకోలేకపోయిన అమెరికా ప్రభుత్వం పదేళ్ల పాటు లాడెన్ కోసం వేట కొనసాగిస్తూనే ఉంది. చివరకు 2011 లో పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో లాడెన్ ను హతమార్చింది. 2001లో అప్ఘానిస్థాన్కు తన సైన్యాన్ని తరలించిన అమెరికా ఇప్పటికీ అక్కడినుంచి పూర్తిగా వైదొలగలేదు. అధికారంలోకి రిపబ్లిక్ లు ఉన్నా…డెమోక్రటిక్ లు ఉన్నా… ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ పై ఆ దేశం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో అని ప్రపంచమంతా గమనిస్తుంది.
మరిన్ని వార్తలు: