వివాహితపై కత్తితో దాడి చేసి గొంతు కోసిన ఓ యువకుడు అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గనూర్ శివారులోని తమిళకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణం వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం అల్గనూర్‌లో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఇంట్లో వివాహిత కవితపై స్థానికంగా ఉంటున్న రాజేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. కవిత పక్కనే ఉన్న ఆమె కుమారుడు (5 ఏళ్లు) పెద్దగా అరుస్తూ ఏడ్వటంతో.. రాజేష్ అదే కత్తితో తానూ గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకున్నాడు. అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటి యజమాని వెంటనే కవిత భర్త గణేష్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కూలీ పనికి వెళ్లిన కవిత భర్త గణేష్.. తన భార్యపై దాడి చేసిన వార్త విని వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. స్థానికులు రాజేశ్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే కవిత, రాజేశ్ మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రాజేశ్, కవిత వివాహేతర సంబంధం గురించి గణేశ్ ఇంట్లో తెలియడంతో ఇంటిని ఖాళీ చేశారని తెలిసింది. ఈ క్రమంలో కవితను కలవడానికి వీలుకాకపోవడంతో ఆగ్రహానికి గురైన రాజేశ్.. శుక్రవారం ఆమెను కలుసుకునేందుకు వెళ్లాడు. బాధితురాలు విషయం బయటపడుతుందని వెళ్లిపోవాలని సూచించడంతో ఆగ్రహానికిలోనైన రాజేశ్ బ్లేడ్ తీసుకుని కవితపై దాడి చేసినట్లు సమాచారం.