Election Updates: APPSC అక్రమాలపై బాధ్యులైన వారిపై చర్యలు

Election Updates: Action against those responsible for APPSC irregularities
Election Updates: Action against those responsible for APPSC irregularities

APPSC అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2018 గ్రూప్-1 పరీక్షల్లో రూ.250 కోట్ల మేర కుంభకోణం జరిగిందని TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్గోపాల్ విశాఖ మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం జగన్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్, కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ప్రణవ్గోపాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

గుంటూరులో జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణలు పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ దూడిని కలిసి ఫిర్యాదు అందజేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ పరీక్షల డిజిటల్ మూల్యాంకనంలో ఓఎంఆర్ షీట్లు మార్చి వేసి వైకాపా ప్రభుత్వం 169 పోస్టులు అమ్ముకుందని సాయికృష్ణ ఆరోపించారు. సీఎం, APPSC ఛైర్మన్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. APPSC పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో సీఎం, APPSC ఛైర్మన్ తదితరులు అవినీతికి పాల్పడ్డారని TNSF కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్ ఆరోపించారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టును రూ.2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ.1.50 కోట్లకు అమ్ముకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.