మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేయాల్సింది. ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి అన్నారు. న్యాయంకోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించిన పలు వివరాలతో ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్, IPDR డేటాను సునీత వెల్లడించారు.
‘‘మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పింది. దీనిలో A1గా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ (A2), ఉమాశంకర్రెడ్డి (A3), దస్తగిరి (A4) ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డితో ఎంపీ అవినాష్రెడ్డికి పరిచయం ఉంది. ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్యాదవ్ దిగిన ఫొటోలు ఉన్నాయి. వివేకా వద్ద PAగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. అవినాష్ మాత్రం వీళ్లెవరో తెలియదని అంటున్నారు. ఫొటోలు, ఫోన్ డేటా చూస్తే అతడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి బలమైన నాయకుడు. ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయ పడ్డారు. ఆయన తండ్రి, మరో నిందితుడు భాస్కర్రెడ్డి ఫోన్ డేటా పరిశీలిస్తే మార్చి 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ఛాఫ్ ఉంది. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్- ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వెళ్లాయి’’ అని సునీత అన్నారు.