మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. వివేకానందరెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఓడించాలని కొందరు ప్రయత్నించారు. సొంతవాళ్లే మోసం చేయడంతో వివేకా ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా.. మరింత యాక్టివ్ అయ్యారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్క లేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైంది. అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు.
హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ నా వద్దకు వచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తనకోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు. మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? హత్యా రాజకీయాలు ఉండకూడదు. మోసానికి, వంచనకి పాల్పడిన మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయొద్దు. అవినాష్, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే. జగన్ పై విచారణ చేయాలి.. నిర్దోషి అయితే వదిలేయాలి’’ అని సునీత వ్యాఖ్యానించారు.