తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నందున ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తోంది. కేసీఆర్ భరోసా, తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారంలో జోష్ చూపిస్తూ.. పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలతో పాటు మరికొన్ని వినూత్న పథకాలు తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో కొత్త పథకానికి నాంది పలకాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారట. ఆ పథకం ఏంటంటే..?
రాష్ట్రంలో మధ్య తరగతి వర్గాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కొత్త పథకం తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. రుణం తీసుకుని ఇల్లు కొనే వారికోసం ఈ పథకం అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా గృహరుణ వడ్డీని ప్రభుత్వమే కడుతుందని వెల్లడించారు.. తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అనేది తమ భవిష్యత్తు లక్ష్యాల్లో ఒకటని మంత్రి కేటీఆర్ వివరించారు.