రుషికొండపై ముఖ్యమంత్రి నివాస సముదాయాన్ని నిర్మించుకొని, ఇప్పుడు దాన్ని టూరిజం ప్రాజెక్టని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవన సముదాయానికి ఆమె రిబ్బన్ కట్ చేసి పూజలు చేస్తారట అని, క్రైస్తవ ఆచారం ప్రకారం ప్రార్థనలే చేస్తారో లేక పూజలే నిర్వహిస్తారో తెలియదన్నారు.
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ లోకి అడుగు పెట్టడానికి జగన్ గారు గజ కర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినప్పటికీ, అమరావతి రైతులు న్యాయస్థానం ద్వారా అడ్డుకొని ఆయన్ని అడుగుపెట్టకుండా నిర్బంధించగలిగారని, ఇంకో 10 నుంచి 12 రోజుల వ్యవధిలో ఎన్నికల కోడ్ వస్తుందని, అప్పుడు జగన్ గారు అరువు హెలికాప్టర్ వేసుకుని తిరుగాల్సిందే తప్ప ఎంతో ముచ్చటపడి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ లోకి వెళ్లగలిగేదే లేదన్నారు. 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ లను నిర్మించుకున్న జగన్ గారు గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయే విధంగా పేద ప్రజల ఇండ్లు నిర్మించడం దారుణమని అన్నారు. ఇప్పటికి కట్టింది కొన్ని ఇళ్ళే అయినప్పటికీ, అవన్నీ టపా టపా కూలిపోతున్నాయని తెలిపారు.