పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వరసగా రెండో రోజూ గురువారం అధికారులు భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నారు. చీరల పెట్టెలపై సీఎం జగన్ చిత్రాలు ఉండడం గమనార్హం . నిన్న 1680.. నేడు 5,280.. రేపు ఎన్ని పట్టుకుంటారోనన్న చర్చ నడుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు నిల్వ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా నాయకులు సత్తెనపల్లి పారిశ్రామికవాడలోని ఓ గోదాంలో భారీగా చీరలు నిల్వ చేశారని, తనిఖీలు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి పూజల వెంకటకోటయ్య నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు.
ఆర్డీవో ఆదేశాలతో ఫ్లయింగ్ స్క్వాడ్ గోదాం వద్దకు వెళ్లగా, తాళం తీసేందుకు అక్కడి వారు సహకరించలేదు. పోలీసులు గోదాం తాళం పగులగొట్టగా 110 బండిల్స్ వెలుగు చూశాయి. 5,280 చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. గోదాంలో చీరలు నిల్వ చేసింది తానేనని వైకాపా వాణిజ్య విభాగం నాయకుడు, వస్త్ర వ్యాపారి భవిరిశెట్టి వెంకటసుబ్రహ్మణ్యం అక్కడికి వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నరసింహారావు వస్త్ర వ్యాపారితో చీరలు ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎందుకు తెచ్చారు.. వాటిపై ఏ చిత్రాలు ఉన్నాయని ప్రశ్నించారు. చీరల బాక్స్ లపై జగన్ చిత్రాలు ఉన్నాయా? అనే సందేహాన్ని సదరు వస్త్ర వ్యాపారి వ్యక్తం చేయడంతో వారంతా ఆశ్చర్యపోయారు. సుబ్రహ్మ ణ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.