ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని పార్టీలకు ఒకే విధంగా వర్తింపజేయాలి. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గే కొంతమంది అధికారుల కారణంగా కోడ్ సక్రమంగా అమలు కావడంలేదు. ముఖ్యంగా ఈ వివక్ష మరీ ఎక్కువగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కనిపిస్తోంది. పసుపు రంగు ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు స్వామిభక్తితో పనిచేస్తున్న అధికారులు..
అధికార పార్టీ రంగులతో ఉన్న వాటి జోలికి వెళ్లే ధైర్యం మాత్రం చేయట్లేదు. మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడంతో తెదేపా రంగులేవీ కనిపించకుండా చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లిలో వైకాపా రంగులతో ఉన్న తోపుడు బండ్లు సీఎం నివాసానికి సమీపంలోనే రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైకాపా శ్రేణులు ఏర్పాటుచేసిన సిమెంట్ బల్లలనూ ముట్టుకునే ధైర్యం కూడా చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.