‘క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయకేతనం ఎగురవేస్తున్నాం.. అది పిఠాపురం నుంచి మొదలుపెడుతున్నాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మంగళవారం ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. మహిళలు నిర్భయంగా తిరగగలిగే రోజులు రావాలి. కార్మికులు, రైతులు, రైతు కూలీలు.. అందరికీ మంచి జరగాలి’ అని ఆకాంక్షించారు.
పంచాంగ పఠనం.. ఆశీర్వచనాలు
ఈ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పిఠాపురం తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే S.V.S.N.వర్మ, భాజపా ఇన్‌ఛార్జి కృష్ణంరాజు, కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్లతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితులు పంచాంగ పఠనం చేసి ఆశీర్వచనాలు అందించారు. పవన్ కళ్యాణ్‌కు ఉగాది పచ్చడి అందించి వర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేదపండితులను పవన్ సత్కరించి, గంటల పంచాంగం పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఉపాధ్యక్షులు B.మహేందర్‌రెడ్డి, నేతలు వేములపాటి అజయ్‌కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్, కల్యాణం శివశ్రీనివాస్, N.శంకర్‌గౌడ్, యాతం నగేష్, A.V.రత్నం, బన్నీవాసు పాల్గొన్నారు.