తెలంగాణ వ్యాప్తంగా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందుగానే ఎన్నికల ప్రచారం షురూ చేసింది. కేసీఆర్ సర్కార్ తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి గురించి ప్రచారంలో పదే పదే చెబుతున్నారు. అభ్యర్థులు కూడా ఇంటింటికి దీన్ని తీసుకువెళ్లాలని పార్టీ నాయకత్వం సూచించింది.
ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆలేరు పట్టణంలో భారీ ర్యాలీగా ప్రచారానికి వెళ్లగా, అనుకోని ఘటన చోటుచేసుకుంది. సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ అక్కడి నుంచి పరుగు తీశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత, ప్రచార రథం దిగి తన వాహనంలోకి వెళ్లి కూర్చున్నారు. అనంతరం మిగతా వార్డుల్లో ప్రచారం కొనసాగించారు.