Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదేళ్ల క్రితం… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ సమాజంలో బలంగానే ఉంది కానీ…ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం మాత్రం పెద్దగా ఎవరికీ లేదని చెప్పొచ్చు. తెలంగాణ ఆకాంక్షను అత్యంత బలంగా వ్యక్తీకరించిన విద్యార్థులు, ఉద్యోగుల్లో సైతం తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఉండేది కాదు. అంతదాకా ఎందుకు తెలంగాణకు దశను, దిశను నిర్దేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా… ప్రత్యేక రాష్ట్రం కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదనే చెప్పొచ్చు. అసలు తెలంగాణ ఏర్పాటు…అంతకుముందు జరిగిన పరిణామాలను ఓ సారి అవలోకనం చేసుకుంటే….
మంత్రి పదవి రాలేదనో, మరో కారణం చేతో కలిగిన అసంతృప్తో… కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు దిశగా కదిలించింది. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి చల్లారిన తర్వాత..30 ఏళ్లకు పైగా .తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎవరూ ఆ ఊసు ఎత్తలేదు. ప్రజల మనసుల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ఉన్నప్పటికీ అది వినిపించే రాజకీయసాధనం వారికి అందుబాటులో లేదు. ఆ పరిస్థితుల్లో 2001లో కేసీఆర్, బీజేపీ నేత ఆలె నరేంద్రతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుచేశారు. అన్యాయం జరిగిందని భావిస్తున్న యువతకు, అసంతృప్తివాదులకు, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునే సమస్త వర్గాలకు రాజకీయ వేదిక కల్పించారు. నిజానికి టీఆర్ ఎస్ ఏర్పడినప్పుడు ఆ పార్టీపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.
కేసీఆర్ ను ఎవరూ తెలంగాణ కు ప్రాతినిధ్యం వహించే నేతగా గుర్తించనూ లేదు. తన రాజకీయ అసంతృప్తితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేసీఆర్ పార్టీ పెట్టారని, కొన్నాళ్ల తర్వాత చంద్రబాబుతో కేసీఆర్ కు రాజీ కుదురుతుందని అంతా భావించారు. ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ప్రజల్లో బలంగా లేకపోతే…అదే జరిగి ఉండేది. కానీ టీఆర్ ఎస్ పెట్టిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అందరి ఆలోచనలూ మార్చివేశాయి. పార్టీ ప్రారంభించిన కొన్ని నెలలకే టీఆర్ ఎస్ ఆ ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపింది. తెలంగాణ ప్రజల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక ఆకాంక్ష ప్రపంచానికంతటికీ అప్పడే తెలిసింది. ఆ ఫలితాల తర్వాత కేసీఆర్ ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఎన్ని అవాంతరాలు, ప్రతికూలతలు ఎదురయినప్పటికీ టీఆర్ ఎస్ ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించడం ప్రారంభించారు. సాధారణంగా కొత్త పార్టీకి ఫండ్స్ లభించడం కష్టం. కానీ టీఆర్ ఎస్ కు ఏ దశలోనూ ఆ ఇబ్బంది ఎదురు కాలేదు. దీనికి కారణం తెలంగాణ ను బలంగా కోరుకుంటున్న అనేక వర్గాల నుంచి కేసీఆర్ కు ఇబ్బడిముబ్బడిగా నిధులు అందడమే. పార్టీ నడిపించడానికి కావల్సినన్ని డబ్బులు ఉండడంతో కేసీఆర్ ప్రత్యర్థులను చిత్తు చేసే రాజకీయ వ్యూహాలపై దృష్టిపెట్టారు. అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు దీటుగా వ్యూహాలు రచిస్తూ పార్టీ పెట్టిన మూడేళ్ల కాలంలో టీఆర్ ఎస్ ను తెలంగాణలో బలమైన పార్టీగా మార్చారు. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులకూ అప్పుడు టీఆర్ ఎస్ ప్రత్యామ్నాయంగా కనిపించేది.
2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకునేదాకా టీఆర్ ఎస్ టీడీపీ, కాంగ్రెస్ తో సమానదూరమే పాటించింది. ఎప్పుడైతే చంద్రబాబు ముందస్తు కు సిద్దమయ్యారో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రజల్లో ఉన్న ప్రత్యేక ఆకాంక్ష గుర్తించిన అప్పటి కాంగ్రెస్ సీనియర్లు ఎన్నికల్లో టీఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకోవాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ పొత్తు ఏమాత్రం ఇష్టంలేకపోయినప్పటికీ సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. అలా ప్రత్యేక రాష్ట్రం కోరుకునే తెలంగాణ, సమైక్యాంధ్రప్రదేశ్ అని నినదించే కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలో దిగింది. ఊహించినట్టుగానే తెలంగాణలో టీఆర్ ఎస్ గెలుపొంది..కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలోనూ కేసీఆర్ మంత్రి పదవిచేపట్టారు. వైఎస్ హయాంలో టీఆర్ ఎస్ కు పార్టీ కార్యాలయం నిర్మించుకునేందుకు స్థలం లభించింది. తెలంగాణ పాలనలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి భవన్ అప్పుడు నిర్మించినదే. కాంగ్రెస్, టీఆర్ ఎస్ ప్రభుత్వం కొన్నాళ్లు సజావుగానే నడిచినప్పటికీ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఏడాదికే ప్రభుత్వం నుంచి టీఆర్ ఎస్ బయటకు వచ్చింది.
తెలంగాణ ఉద్యమం తీవ్రతరం చేసింది. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల కారణంగా ఆ ఐదేళ్ల కాలంలో తెలంగాణ పదే పదే ఉప ఎన్నికలు ఎదుర్కొంది. పోటీచేసిన ప్రతిసారీ కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా విజయం సాధించేవారు. తెలంగాణ సమాజంలో అంతకంతకూ బలీయమవుతున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా ఉండేవి. ఇలా కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతల రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల మధ్యనే ఐదేళ్ల పాలనాకాలం గడిచిపోయింది. ఆ ఐదేళ్ల కాలంలో తెలంగాణ సమాజం తరపున టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రం వాదన నిరంతరంగా వినిపిస్తున్నప్పటికీ…రాష్ట్రం ఏర్పడే పరిస్థితులు సుదూర తీరంలో కనిపించేవి కావు. రాజకీయ చర్చలకు, టీఆర్ ఎస్ ఉనికికి ఆ అంశం హాట్ టాపిక్ లా మాత్రం ఉండేది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ ఎస్, టీడీపీ పొత్తుపెట్టుకున్నాయి. ఆ ఎన్నికల సమయంలోనే టీడీపీ ప్రత్యేకరాష్ట్రానికి మద్దతుగా తొలిసారి నిర్ణయం తీసుకుంది. అయితే అప్పుడు ఆశించిన ఫలితం దక్కలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మరోసారి ఘనవిజయం సాధించింది. అప్పటికి టీఆర్ఎస్ ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచాయి. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక ఆకాంక్ష మరింత బలపడింది. పోరాటాన్ని ఉధృతం చేయాలని కేసీఆర్ పై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ముందు ఎనిమిదేళ్లపాటు జరిగిన పరిణామాలివి. టీఆర్ ఎస్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తీరు తర్వాతి వ్యాసంలో చూద్దాం..