Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గతంలో దైవ సమానుడిగా పూజలందుకున్న డేరా బాబా చీకటి జీవితం వెలుగులోకి రావటంతో ఆయన అకృత్యాలపై నోరు విప్పేందుకు ప్రత్యక్ష సాక్షులు ముందుకొస్తున్నారు. ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో గుర్మీత్ దోషిగా నిర్దారణ అయిన తర్వాత సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో జరిగే ఘోరాల గురించి అనేక మంది వివరాలు వెల్లడిస్తున్నారు. గుర్మీత్ కు గతంలో బాడీగార్డుగా పనిచేసిన బియాంత్ సింగ్ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెల్లడించాడు. తాజాగా ఇద్దరు వ్యక్తుల హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబాకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు ఆయన మాజీ డ్రైవర్ ఖట్టాసింగ్ ముందుకొచ్చారు. జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకేసుల్లో ప్రధాన కుట్రదారుడిగా గుర్మీత్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
పంచకులలోని సీబీఐ ప్రత్యేకన్యాయస్థానంలో జరుగుతున్న ఈ కేసు విచారణకు గుర్మీత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. అయితే ఈ హత్య కేసుల్లో ప్రధాన సాక్షిగా ఉన్న గుర్మీత్ మాజీ డ్రైవర్ ఖట్టాసింగ్ తన వాంగ్మూలాన్ని మళ్లీ తీసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలోనే ఖట్టాసింగ్ ఈ కేసుల్లో తన వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో డేరా అనుచరుల బెదిరింపుల కారణంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని …ఇప్పుడు మరోమారు తన వాంగ్మూలం తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. తనను,తన కుమారుడిని చంపేస్తానని డేరా బాబా అనుచరులు బెదిరించారని, అందుకే భయపడ్డానని, ఇప్పుడు మళ్లీ తన వాంగ్మూలం తీసుకోవాలని ఆయన పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇక డేరా బాబా అభియోగాలు ఎదుర్కొంటున్న హత్యకేసు వివరాల్లోకి వెళ్తే…ఆశ్రమంలోని అకృత్యాలపై 2002లో అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇద్దరు సాధ్విలు రాసిన రహస్యలేఖను జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి తన పత్రికలో ప్రచురించారు. జాతీయ స్థాయి పత్రికలు డేరాకు వ్యతిరేకంగా చిన్న వార్త రాయటానికి కూడా గజగజా వణికిపోతున్న రోజుల్లో సాధ్విల రహస్య లేఖను ఎంతో ధైర్యంగా రామచందర్ ఛత్రపతి తన పత్రిక పూర సచ్ఛ్ లో ప్రచురించారు.
ఈ ఘటన తర్వాత ఆయన అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే డేరా అనుచరులే ఛత్రపతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. డేరా బాబా అకృత్యాలపై 2002నుంచి ఈ ఆగస్టులో శిక్ష పడేదాకా అలుపెరగకుండా పోరాటం చేసిన మరో మహిళ..గతంలో డేరా బాబా నిర్వహణలోని ఓ స్కూల్లో చదువుతుండేది. ఆమె అన్నయ్య రంజిత్ సింగ్ డేరా ఆశ్రమానికి మేనేజర్ గా పనిచేస్తుండేవారు. అయితే బాబా ఆ విద్యార్థినిపై అకృత్యానికి ఒడిగట్టడంతో ఆమె అన్న ఆశ్రమంలో బాబా అకృత్యాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే సాధ్వీ లేఖ వెలుగుచూడటంతో ఆ లేఖ రాసింది ఈ విద్యార్థి అన్న అనుమానంతో ఆమె అన్నయ్య రంజీత్ సింగ్ ను డేరా అనుచరులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ రెండు కేసులపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. మరోవైపు ఈ రెండు హత్యకేసుల వెనక బాబా హస్తముందని నిర్ధారణ జరిగితే ఆయనకు ఉరిశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు.