లగడపాటి రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ గా, ఒక సీనియర్ నేతగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ప్రతి ఎన్నికలకి ఆయన నిర్వహించే పొలిటికల్ సర్వేల కోసం రాజకీయ నేతలే కాకుండా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దానికి గల ముఖ్యకారణం లగడపాటి సర్వేలు నూటికి 90 శాతం కి పైగా నిజం అవ్వడమే. అందుకే ఇతన్ని ఆంధ్ర ఆక్టోపస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈరోజు ఉదయం తిరుమలకి వచ్చి శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి రాజగోపాల్ అక్కడి మీడియాతో రానున్న తెలంగాణ ఎన్నికల గురించి తన అభిప్రాయాలని పంచుకున్నారు.
డిసెంబర్ 7 న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు స్వతంత్ర అభ్యర్థులను ఎన్నుకోనున్నారని, రాష్ట్రంలో కనీసం 8 నుండి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు / రెబెల్స్ విజయం సాధించబోతున్నారని, రోజుకి రెండు పేర్లు చొప్పున ఆ పది మంది స్వతంత్రుల లిస్టుని ప్రకటిస్తానని లగడపాటి తెలిపారు. ఈ లిస్టులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట నియోజకవర్గానికి చెందిన బిఎల్ఎఫ్ అభ్యర్థి శివకుమార్ మరియు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ లు ఎమ్మెల్యేలుగా విజయం వరించబోతున్నారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుందో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పార్టీలకు అతీతమైన తన సర్వే పూర్తి ఫలితాలను డిసెంబర్ 7 న విడుదల చేస్తానని ప్రకటించారు.