ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంత బలంగా వుందో చెప్పడానికి ఈ నాయకుడి మాటలు ఓ ఉదాహరణ . ఇంతకీ ఆ నాయకుడు ఇంకెవరో కాదు. చంద్రబాబు ని ఒకప్పుడు దేవుడుగా ఇప్పుడు దెయ్యంగా అభివర్ణిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణ నేత అయినప్పటికీ ఆంధ్ర రాజకీయాల మీద అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్న ఈయనగారు చేసిన ప్రకటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల దుస్థితికి అద్దం పడుతోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కి చంద్రబాబు వెళ్లి బతిమాలుకొని పవన్ కళ్యాణ్ ని వెంట తెచ్చుకోవడమే కారణం అని మోత్కుపల్లి తేల్చేశారు. ఈసారి పవన్ దూరం అయ్యారు కాబట్టి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. అంతటితో ఆగిపోయివుంటే నిజమే చంద్రబాబు వీక్ అయిపోయారు అని నమ్మడానికి వీలు ఉండేదేమో. కానీ మోత్కుపల్లి ఇంకో అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని ఓడించాలంటే జగన్ , పవన్ , సిపిఐ , సిపిఎం లు ఒక్క తాటి మీదకు రావాలని పిలుపు ఇచ్చారు.
ఈ మధ్య జగన్ కుడిభుజం విజయసాయి రెడ్డి వచ్చి మోత్కుపల్లిని కలిసిన తర్వాత ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం చూస్తుంటే ఆంధ్రాలో గెలుపు గురించి వైసీపీ కి ఏ మాత్రం నమ్మకం లేదని అనిపిస్తోంది. అందుకే పవన్ , సిపిఐ , సిపిఎం ని కలుపుకుపోవడానికి మోత్కుపల్లి లాంటి వాళ్ళని వాడుతోంది. అయినా మోత్కుపల్లి చెబితే ఎవరు వింటారు?. వీళ్ళు అందర్నీ ఆడిస్తున్న మోడీ , అమిత్ షా దగ్గర నుంచి ఆదేశాలు వస్తేనే లోపాయికారీ పొత్తులు బహిర్గతం అవుతాయి.