టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల రచ్చ కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అయితే రెండు చోట్ల మాత్రం సిట్టింగ్ లను కాదని వేరే అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అలాగే కొన్ని సీట్లకు అభ్యర్ధుల ప్రకటన ఆపారు. ఇప్పుడు ఈ నిర్ణయమే ఇపుడు పార్టీతో పాటు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఎలాగోలా బాబు మోహన్ ను కేసీఆర్ బుజ్జగించాగా ఆయన ఊరుకున్నారు. చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ కేటాయించకపోవడంతో అతడితో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న కేసీఆర్ తనకు టికెట్ ఖరారు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని గృహ నిర్భంధంలోకి వెళ్లారు ఓదెలు. తాజాగా మనస్థాపంతో ఓదేలు మద్దతుదారుడొకరు బాల్క సుమన్ ప్రచార కార్యక్రమంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన ఇవాళ ఇందూరు గ్రామంలో చోటుచేసుకుంది.
తమ నేతకు టికెట్ ఇవ్వకుండా ఎంపీ బాల్క సుమన్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన ఇందారంలో చేయాలనుకున్న ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓదేలు వర్గానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆ మంటలు చుట్టుపక్కల వారికి కూడా అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న ఎంపీ మీద కూడా పెట్రోలు చల్లడంతో ఆయన చావుతప్పి కన్ను లొట్ట బోయిన చందాన గన్ మెన్ల సహాయంతో బయటపడ్డారు. లేకపోతే ఆయన కూడా గాయాలు పాలయి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై బాల్క సుమన్ స్పందించారు. చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోలు పోసి, అగ్గిపుల్ల వేసేందుకు యత్నించారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. తన గన్ మెన్ తో పాటు మరికొందరు మిత్రులు తనను రక్షించారని అన్నారు. తనపై హత్యాయత్నం చేసినవారికి ఒకటే చెబుతున్నానని తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు.