డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతారని ఎవ్వరూ ఊహించలేదు…కోరుకోలేదు. ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగటం రిపబ్లికన్లకే చాలా మందికి ఇష్టం లేదు. ఎన్నికలకు ముందు ట్రంప్ గెలుపుపై సొంతపార్టీలోనూ ఎవరికీ నమ్మకం లేదు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను మరీ ఎక్కువ మెజార్టీతో గెలిపించకండి అని కూడా రిపబ్లికన్ పార్టీ నేతలు అభ్యర్థించారంటే…ట్రంప్ ఓడిపోతారన్న భావం వారిలో ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ అందరి అంచనాలూ తలకిందులు చేస్తూ ఎన్నికల్లో ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. 2017 జనవరిలో ఒబామా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి వైట్ హౌస్ లో అడుగుపెట్టారు. మరి శ్వేతసౌధంలో సంపన్న రాజకీయవేత్త అయిన ట్రంప్ వ్యవహారశైలిఎలా ఉంది…? అధ్యక్షుడిగా ఆయన ఎంత మేర సక్సెస్ అయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితం ఎలా సాగుతోంది… వంటివి అమెరికా పౌరులతో పాటు మిగతాదేశాలకూ ఉన్న ఆసక్తికరమైన సందేహాలు. వాటన్నింటికీ జవాబు ఇస్తోంది మైఖేల్ వోల్ఫ్ రాసిన ఫైర్ అండ్ ఫ్యూరీః ఇన్ సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్. ఈ పుస్తకం ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడుపోతోంది.
సేల్ ప్రారంభమైన గంటల్లోనే బుక్ షాపులు ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టేశాయి. ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్ లో ఈ పుస్తకం ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించి…సేకరించిన పుస్తకంగా చెప్తున్న ఫైర్ అండ్ ఫ్యూరీ లో ఎన్నో ఆసక్తికర, వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఈ పుస్తకం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు. ఏ విషయంపైనైనా…ఆయన పట్టుమని పదినిమిషాలు కూడా దృష్టి నిలపలేకపోతున్నారు. గతంలో ఒకే విషయాన్ని అరగంటలో పదిసార్లు చెప్పేవారు. ఇప్పుడు పదినిమిషాల్లో పదిసార్లు చెబుతున్నారు. ట్రంప్ ది పూర్తిగా చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన కీలక వ్యక్తుల్ని కూడా గుర్తుపట్టలేరు. రాజ్యాంగంలోని కీలక అంశాల్ని విడమర్చిచెప్పినా అర్దంచేసుకోలేరు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేరోజు భార్య మెలానియాతో తీవ్రంగా గొడవపడి ఆమె ఏడ్చేటట్టు చేశారు. ట్రంప్ కుమార్తె ఇవాంక తన తండ్రి జుట్టు రంగును వెక్కిరించేది.
ఆ జుట్టులో తన తండ్రి బఫూన్ లా ఉన్నారనేది. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కావాలన్నది ఇవాంక ఆశ. ఆమె చాలా అత్యాశ ఉన్న మహిళ. మీడియా కింగ్ రూపర్డ్ మర్దాక్ తో ట్రంప్ నిత్యం ఫోన్లో చాలా సేపు మాట్లాడతారు. అమెరికా అధ్యక్ష వ్యవహారాల్లో ఆయన దాదాపు ఓ భాగమైపోయారు. ఇలాంటి వైట్ హౌస్ రహస్యాలెన్నింటినో మైఖేల్ వోల్ఫ్ తన పుస్తకంలో పొందుపరిచారు. అయితే ఈ పుస్తకంలో ఉన్నవన్నీ అబద్ధాలేనని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. వోల్ఫ్ కు తాను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే తన పుస్తకం అమ్మకాలపై ప్రభావం చూపించాయని, అందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని మైఖేల్ వోల్ఫ్ ప్రకటించడం విశేషం.