ప్రజలందరికీ సమాన వైద్యం అందేలా వైద్యులు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గ్రామీణ ప్రజల్లో ఎక్కువ శాతం మందికి పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని.. దీనిపై వైద్యులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో నాలుగు రోజుల సదస్సు బుధవారం విశాఖలో ప్రారంభమైంది. తొలిరోజు ఆసికాన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘డాక్టర్లు ఎలాంటి లాభం ఆశించకుండా విధులను నిర్వర్తించాలి. 40 వేల మంది సభ్యులున్న ఏఎస్ఐ.. ప్రపంచంలో రెండో పెద్ద సర్జికల్ అసోసియేషన్. ఇలాంటి వేదికలపై సీనియర్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని నైపుణ్యం మెరుగుపరచుకోవాలి. కేన్సర్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించిన రోజు చూడాలని ఆశిస్తున్నా ’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పి.రఘురామ్, విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు, కామినేని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ కె.పట్టాభిరామయ్య లకు ఏఎస్ఐ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఆర్గనైజింగ్ ఛైర్మన్ డా.శాంతారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.పీవీ రమణమూర్తి, వైద్యులు పాల్గొన్నారు.