నాలుగేళ్ల పసిపాప కామ దాహానికి బలి

Four years baby raped in tamilnadu

కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు క్రూర జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాపలు అని కూడా చూడకుండా తమ కామ దాహానికి బలి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పసిబిడ్డను ఇంట్లో ఉంచాలన్నా, అలాగే ఇంటి నుంచి బయటకు తీసుకు రావాలన్నా కూడా వణికిపోయేలా చేస్తోంది. హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచార ఘటనను మరువక ముందే తమిళనాడులో మరో దారుణం బయటపడిది. అందుతున్న సమాచారం ప్రకారం తిరుముల్లైవోయల్‌లో ఓ మెకానిక్ తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. గురువారం మెకానిక్ భార్య తన కొడుకును స్కూల్‌‌లో వదిలేసి కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో ఏమైందో నని తన కూతురి కోసం వెతికింది. పాప కనిపించకపోవడంతో కంగారుపడిన ఆమె చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతికింది. తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. అతడు వెంటనే ఇంటికి వచ్చాడు. దంపతులిద్దరూ పొరుగిళ్లతో పాటూ వీధిలో వెతికినా బాలిక జాడ కనిపించలేదు. వెంటనే భార్యాభర్తలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే వచ్చిన పోలీసులు బాలిక ఉంటున్న ఇంటిని పరిశీలించారు. అనుమానంతో బాత్రూమ్‌లో చూడగా ఓ అనుమానాస్పద మూట తాడుతో కట్టి కనిపించింది. దాన్ని తీసి చూడగా ఓ బకెట్ ఉంది.. అందులోనే బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాప ఒంటిపై గాయాలతో పాటూ రక్తపు మరకలు కనిపించాయి. ఒంటిపై బట్టలు లేకపోవడంతో బాలికపై అత్యాచారం చేసి తర్వాత హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.