తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వరుసగా భేటీ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ చర్చించి ఫ్రంట్‌కు ఓ రూపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించారు. ఇక పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటి తాను ఢిల్లీలో చక్రం తిప్పడమే మిగిలింది. అందుకే… పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయ పరిణామాలు చూస్తూంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కానీ కూటమికి కానీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదనేది.. అందరూ అంచనా వేస్తున్న విషయం. కేసీఆర్ కూడా అదే భావనలో ఉన్నారు. తను సాధించే పదహారు సీట్లే కీలకం అవుతాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పార్లమెంట్‌కు పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ పార్లమెంట్‌కు పోటీ చేస్తే ప్రజల్లో ఊపు వస్తుందని అది అన్ని సీట్లలోనూ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పరిస్థితి హైలైట్ చేసి కేసీఆర్ కూడా పీఎం రేసులో ఉన్న భావన వస్తే ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. నిజానికి పార్లమెంట్ అభ్యర్థులపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వాటిలో తన పేరు కూడా ఉందంటున్నారు. కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయవచ్చని చెబుతున్నారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి గతంలో మూడు సార్లు గెలిచారు. కానీ ఆ మూడు ఒకే టర్మ్‌లో వచ్చాయి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి, 2014లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో అసెంబ్లీకి కూడా పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మెదక్ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా వినోద్‌కుమార్ ఉన్నారు. ఆయనకు మరో చోట సర్దుబాటు చేయడమో రాజ్యసభ సీటు ఇవ్వడమో చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఎంపీ స్థానంలో కేసీఆర్ పోటీ మాత్రం ఖాయమేనన్నట్లుగా టీఆర్ఎస్లో ధీమా కనిపిస్తోంది.