గత కొద్దిరోజులుగా వర్షాలు లేవని దిగులుగా ఉన్న రైతన్నలని చూసి వరుణుడు కరుణించాడు. దీంతో నిన్నటి నుండి ఏపీ రాజధాని అమరావతిలో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. శివారు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూళ్లకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు వర్షంలో తడుస్తూనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వర్షాలు కురవడం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కాల్వల ద్వారా నీటిని విడుదల చేసినప్పటికీ పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ వర్షాలు మేలుచేకూర్చాయి. మరోవైపు రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణశాఖ హెచ్చరించింది.