Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకరు ఓ అడుగు ముందుకేసి మరో అడుగు ఎలా వేయాలా అన్న ఆలోచనలో వున్నారు. ఇంకోరు మొదటి అడుగు కూడా వేయకుండా తర్జనభర్జన పడుతున్నారు. రాజకీయాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజని కాంత్ ల పరిస్థితి. సినిమా రంగంలో వీళ్ళు రాజులు, మహారాజులు, చక్రవర్తులు. రాజకీయాల్లో దారీతెన్నూ అర్ధం కాని బాటసారులు. ఇద్దరి వ్యక్తిత్వాలు, ఆలోచనలు, అనుభవాల్లో ఎంతో తేడా వుంది. సందర్భం అంటూ వస్తే పవన్ ఎదురయ్యే పరిణామాలు ఆలోచించకుండా అడుగేస్తారు. కానీ రజని అలా కాదు. ప్రతి చిన్న విషయానికి పదిరకాలుగా మంచి చెడ్డలు ఆలోచించి కానీ అడుగు ముందుకు వేయరు. ఇలా భిన్న ధృవాలుగా కనిపించే ఈ ఇద్దరూ ఒకే రాజకీయ వేదిక మీదకి వస్తే ఎలా ఉంటుంది?. వారి అభిమానుల కోలాహలంతో భూమి ప్రతిధ్వనిస్తుంది అన్నంతగా నినాదాలు మిన్నంటుతాయి. వేర్వేరు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఇద్దరూ ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం నిజంగా ఉందా అన్న అనుమానం వస్తోందా? . కానీ నిజంగానే ఆ ఇద్దరినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలు అయ్యాయి. ఆ ప్రయత్నం చేసింది ఎవరో కాదు. ఓ తెలుగు వాడు, పాటల వీరుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్.
రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్న గద్దర్ అందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఆయన క్రేజ్ ని వాడుకోడానికి మాత్రమే పార్టీలు గద్దర్ కి ఆహ్వానం పలికాయి. అయితే సైద్ధాంతికంగా ఇతరత్రా ఉన్న ఇబ్బందులతో ఆ ఆహ్వానాలు అక్కడితో ఆగిపోయాయి. కానీ గద్దర్ స్వయంగా ఓ పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగే వ్యూహాన్ని రచించారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది పట్ల సాగుతున్న వివక్ష మీద పోరాటానికి నడుం బిగించాలని తలపోస్తున్నారు. అందుకు సంబంధించిన ఆలోచనలు, విధివిధానాలు గురించి వివరించేందుకు రజని, పవన్ ల దగ్గరకు గద్దర్ తన దూతలని పంపారు. వారు ఒప్పుకుంటే ఇదే ప్రాతిపదిక మీద విస్తృత స్థాయి రాజకీయ వేదిక ఏర్పాటుకి అవకాశం ఉంటుంది. పవన్ ఇప్పటికే దక్షిణాది పట్ల వివక్ష మీద తరచుగా గళం విప్పుతున్నారు. ఇక రజని పుట్టుకతో మరాఠీ. పెరిగింది కర్ణాటకలో. తనను ఆదరించి ఇంతవాడిని చేసింది తమిళ ప్రజలు. ఈ మూలాలే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో రజని అడుగులు ముందుకు పడకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు గద్దర్ సూచిస్తున్న దారి ఆ సమస్యని అధిగమించడానికి రజని కి అవకాశం ఇస్తుంది. ఆయన తమిళుడు కాదనే ముద్ర నుంచి బయటపడడం తేలిక అవుతుంది. అయితే ఆ దారిలో వెళితే రాజకీయ పోరాట వేదిక తమిళనాడుకి మించి పోతుంది. రజని అంత సాహసానికి పూనుకుంటారా అన్నది సందేహమే. అయితే సరైన రాజకీయ నినాదం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళిద్దరూ గద్దర్ వేయాలనుకుంటున్న బాటలో నడవడానికి సిద్ధమైతే పొలిటికల్ సంచలనాలకు కొదవే ఉండదు.
మరిన్ని వార్తలు