గజ్వేల్ బరిలో గద్దర్…కేసీఆర్ కి ప్లస్సా…!

Gaddar-Want-To-Contest-As-I

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా నెలరోజులు కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీలు ఎన్నికల కదనరంగంలోకి పూర్తిగా దిగినట్టే. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక నియోజకవర్గం మీద ఉంది. అదే గజ్వేల్ నియోజకవర్గం. 2014 లో కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గజ్వేల్ నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు. అయితే ప్రస్తుతం వంటేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమి తరుపున మళ్ళీ ఆయనే బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితేనే వంటేరు, కేసీఆర్ కి గట్టిపోటీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు గజ్వేల్ పోరులోకి ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

CM KCR Announces TRS Candidates 105 For Assembly Seats

నిజానికి గద్దర్.. కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఇంతకుముందే సంకేతాలు ఇచ్చారు. కొన్ని రోజుల కింద‌టే గ‌ద్ద‌ర్ . అంద‌రూ కోరుకుంటే, త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తే కేసీర్ మీద పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఆ నేప‌థ్యంలో గ‌ద్ద‌ర్ కి మ‌హా కూట‌మి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నీ, త‌ద్వారా కేసీఆర్ మీద గ‌ద్ద‌ర్ చేసే విమ‌ర్శ‌ల్ని ఎన్నిక‌ల్లో ప్ర‌చారాస్త్రాలుగా వాడుకోవ‌చ్చ‌ని విశ్లేషకులు విశ్లేషించారు. ఆ త‌రువాత‌, ఒకట్రెండు రోజులు మాత్ర‌మే గ‌ద్ద‌ర్ ప్ర‌క‌ట‌న‌కు ప్రాధాన్య‌త క‌నిపించింది. అదీగాక గద్దర్ ఆ మధ్య ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కూడా అయ్యారు. దీంతో గద్దర్ మహాకూటమి తరుపున బరిలోకి దిగుతారని అనుకున్నారంతా. కానీ కాంగ్రెస్ నుంచి త‌న కుమారుడిని ఎన్నిక‌ల బ‌రిలోకి దింపాల‌ని చివ‌రి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌య‌త్నించిన‌ట్టు స‌మాచారం.

Gaddar

అయితే, ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేక‌పోయింద‌నీ, ఇప్ప‌టికే ఆశావ‌హుల తాకిడి ఎక్కువ కావ‌డంతో టికెట్ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు స‌మాచారం. దీంతో గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే తాజాగా గద్దర్ ఆ ఊహలు అన్నింటికీ బ్రేకులేశారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని.. గజ్వేల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే గజ్వేల్ నుంచి గద్దర్ బరిలోకి దిగితే కేసీఆర్ కి లాభం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గద్దర్ పోటీ వల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలే అవకాశముందని విశ్లేషకులు భావిస్తోన్నారు. చూద్దాం మరి గద్దర్ ఏం చేస్తారో. మహాకూటమికి షాక్ ఇస్తారో లేక కేసీఆర్ కి షాక్ ఇస్తారో. లేదా అనూహ్యంగా ఇద్దరికీ షాక్ ఇస్తారో.

Gaddar-Gajwel-Constituency