Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముసుగులు, తెరలు తొలిగిపోయాయి. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల మీద తెలివిగా కాంగ్రెస్ ని దోషిగా చూపి తప్పించుకుందామని చూసినా టీడీపీ ఆ వల్లో టీడీపీ పడలేదు. ప్రధాని ప్రసంగ సమయంలో టీడీపీ సంయమనం పాటించడం చూసి ఇక ఆ పార్టీ తెల్ల జెండా ఎత్తింది అనుకున్నారు చాలా మంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత అదే సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆ సందేహాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ టీడీపీ కేంద్రానికి షాక్ ఇచ్చింది.
విభజన సమస్యల మీద జరిగిన చర్చలో ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రం మీద సూటిగా బాణాలు వదిలారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్, హోదా కి ప్రత్యామ్న్యాయం గా ప్రకటించిన ప్యాకేజ్… ఇలా ఒక్కో అంశం గురించి ఇచ్చిన హామీ, చేసిన అమలు గురించి విడదీసి చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. మీకు వివరణలు ఇవ్వడానికి ఇదే ఆఖరి అవకాశమని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉత్తుత్తి కబుర్లు చెబితే చూస్తూ ఊరుకోడానికి ఏపీ ప్రజలు ఫూల్స్ కాదని గల్లా జయదేవ్ కుండబద్ధలు కొట్టారు. విభజన హామీలు నెరవేర్చమని కోరడానికి సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వచ్చినా ప్రయోజనం లేకపోయిందని, పైగా బడ్జెట్ లో ఎన్నికలున్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చి ఏపీ పొట్టగొట్టారని అన్నారు. ఇంత జరిగాక మీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
టీడీపీ ఈ స్థాయిలో నిలదీస్తుందని, ఈ స్థాయిలో భాషా ప్రయోగం చేస్తుందని బీజేపీ కూడా ఊహించలేదు. ఇక వైసీపీ సంగతి సరేసరి. తెలంగాణ లో అధికార పార్టీ తెరాస సైతం టీడీపీ వాదనకు సభలో మద్దతు పలకడం రాజకీయంగా అనూహ్య పరిణామం. ఇక nda లోని బీజేపీ యేతర పార్టీలు సైతం టీడీపీ కి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏపీ విభజన హామీల అంశం మీద ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.