Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం ఫలితాన్నివ్వక, దేశ ప్రజలంతా నిరాశానిస్పృహలతో కాలం గడుపుతున్న తరుణమిది. దేశంలో ఓ పక్క విభజన రాజకీయాలు విజృంభిస్తోంటే…మరో పక్క పరాయి పాలన పీడన ప్రజలు వెన్నువిరుస్తోన్న సందర్భమది. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి శాంతియుత నిరసన ప్రదర్శనలేవీ స్వరాజ్యం తెచ్చిపెట్టే సాధనాలుగా మారక, ఏం చేయాలో దిక్కుతోచక దేశమంతా అలమటిస్తున్న సమయమది. ఎందరో నేతల, సామాన్యుల బలిదానాలు కూడా బ్రిటీష్ సామ్రాజ్య పునాదుల్ని పెకలించలేకపోయాయి. ఎందరో స్వాతంత్ర్య వీరులు ఎన్నో పద్ధతుల్లో ప్రయత్నించినా బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి వెళ్లగొట్టలేకపోయారు.
ఇక స్వాతంత్ర్యం రానట్టే అని చిన్నా పెద్దా తేడా లేకుండా దేశ ప్రజలంతా తీవ్ర వైరాగ్యంలో మునిగారు. దేశమంతా ఒక నిస్తత్తువ, నిశ్శబ్ద వాతావారణం. అలాంటి తరుణంలో గాంధీజీ పూరించిన సమరశంఖమే క్విట్ ఇండియా… చావో రేవో తేల్చుకుందాం పదమంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపతో దేశమంతా మళ్లీ రగిలింది. ప్రజలంతా సైనికుల్లా ముందుకురికారు. స్వాతంత్ర్యం సాధించేదాకా ఇక వెనక్కి తగ్గేది లేదంటూ ఆందోళనలు, నిరసనలు, హర్తాళ్లతో హోరెత్తెంచారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు… ఐదేళ్ల పాటు కొనసాగింది. చివరకు 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఇదంతా చరిత్ర. దేశప్రజల్లో ఉరిమే ఉత్సాహాన్ని నింపిన క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రసంగించారు. గాంధీ ఉద్యమాలతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందన్న ప్రధాని ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జీవితంలో మంచి పరిణామాలను స్మరించుకోవాలని, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఘటనల గురించి యువత తెలుసుకోవాలని ఆయన సూచించారు. గాందీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించాలన్నారు. జీవన విధానంలో నియమ నిబంధనలను అతిక్రమిస్త అది హింసకు ప్రేరేపిస్తుందని, ప్రతి ఒక్కరూ గాంధీజీలా అహింసాబద్దంగా జీవించేందుకు ప్రయత్నించాలని మోడీ కోరారు.
మరిన్ని వార్తలు: