Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్ లు సొంతంచేసుకుని భారత్ ను ఆస్ట్రేలియ సరసన నిలబెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. విరాట్ ను అందరూ టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అభివర్ణిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని, ఒకప్పటి వెస్టెండీస్, ఆస్ట్రేలియా జట్ల స్థాయి అందుకుంటుందన్న అంచనాలూ వినపడుతున్నాయి. అయితే మాజీ సారధి సౌరవ్ గంగూలీ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాడు. కోహ్లీని ఇప్పుడప్పుడే గొప్ప కెప్టెన్ గా ఎంచకూడదంటున్నాడు…
గంగూలీ టీమిండియా కెప్టెన్సీకి అసలు సిసలు అర్ధం చెప్పి… భారత క్రికెట్ లో ఓ ప్రత్యేక కెప్టెన్ గా నిలిచిపోయిన గంగూలీ కోహ్లీ సారథ్యం సాగుతున్న తీరును విశ్లేషించాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదని, మంచి కెప్టెన్ కూడా అని, అతని నేతృత్వంలో టీమిండియా విజయాలు సాధిస్తోందని అయితే ఆ విజయాల్లో ఎక్కువశాతం సొంతగడ్డపై దక్కినవే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని దాదా సూచించాడు. విదేశీ గడ్డపై సిరీస్ లు సొంతం చేసుకుంటేనే కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో విజయం సాధిస్తేనే మన సత్తా తెలుస్తుందన్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న టీమిండియా అక్కడి సిరీస్ దక్కించుకుంటే కోహ్లీ గొప్ప కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం ఉండదని గంగూలీ అన్నాడు.
కోహ్లీ నేతృత్వంలో గెలిచిన తొమ్మిది టెస్ట్ సిరీస్ ల్లో రెండు మాత్రమే విదేశీగడ్డపై జరిగినవని, అదీ..అంత బలంగా ఉండని శ్రీలంక, వెస్టెండీస్ పై కోహ్లీ సేన విజయం సాధించిందని, మిగిలిన వన్నీ… భారత్ లో జరిగినవే అని గంగూలీ అన్నాడు. టెస్టుక్రికెట్లో బలమైన దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై ఆయా దేశాల్లో సిరీస్ లు గెలిచినప్పుడే కోహ్లీ సామర్థ్యాన్ని అంచనా వేయగలమన్నాడు. సొంతగడ్డపై కోహ్లీ ఇప్పటికే 90శాతం రుజువు చేసుకున్నాడని, ఇక విదేశీ గడ్డలపై నిరూపించుకోవాల్సి ఉందని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మన జట్టు మంచి ప్రదర్శన చేయాలని గంగూలీ ఆకాంక్షించాడు.