Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు భరించలేని స్థాయికి వెళ్తోంది. ఒకపక్క రాష్ట్రానికి జరిగిన అనయాన్ని జాతీయస్థాయిలో బయటపెట్టి, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూసుకుందామని అధినేత చంద్రబాబు రాత్రనకా, పగలనకా కష్టపడుతోంటే ఆ పార్టీకి చెందిన మంత్రులు గాని, నేతలు కానీ ఆయన వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి ఆయనకి తలనొప్పిగా మారారు. మొన్నటికి మొన్న అఖిలప్రియ-ఏవీ సుబ్బారెడ్డి ఉదంతం ఇప్పుడు మరలా గంటా-అయ్యన్న వివాదం తెర మీదకి వచ్చింది. విశాఖలో మంత్రులు గంటా… అయ్యన్నపాత్రుడు మధ్య ఉన్నఆధిపత్య పోరు పాతదే. ఎన్నికలయి ఇద్దరు మంత్రులయిన కొద్దిరోజులకే రచ్చకెక్కినా చంద్రబాబు చేసిన రాజకీయం వల్ల ఇద్దరు కాస్త సైలెంట్ అయ్యారు.
అయితే అవకాసం వచ్చినప్పుడల్లా రచ్చకేక్కడం ఇద్దరికీ రివాజుగా మారింది. ఏడాది క్రితం విశాఖ భూ-కుంభకోణాల్లో గంటా హస్తం ఉందని కావాలంటే నేనే సాక్ష్యాలు సైతం ఇస్తానని బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే త్వరగానే ఆ వివాదం అటకెక్కడంతో ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న మంత్రులు ఇప్పుడు డీఎల్ డీఏ (జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ) కమిటీ నియామకం విషయంలో మరలా రచ్చకెక్కారు. తనకు తెలీకుండా డీఎల్ డీఏ (జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ) కమిటీని కొనసాగించటంపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంటా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు. మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం పదవుల కోసమే తెలుగుదేశం పార్టీలో చేరారని, గతాన్ని మరచిపోయి ఆయన మాట్లాడుతున్నారని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.
తొలుత తెలుగుదేశంలో ఉండి, ఆపై ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరి, తిరిగి ఆయన మంత్రి పదవి కోసమే టీడీపీలోకి వచ్చారని, మూడు పార్టీలు మారిన విషయాన్ని మరచిపోయి, ఆయనకు మంత్రి పదవిని ఇస్తే, ఇప్పుడు రాజకీయ స్వలాభాన్నే ఆయన చూసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. డీఎల్ డీఏ కొత్త కమిటీ నియమిస్తే తనకు అభ్యంతరం లేదు కానీ… జిల్లాకు చెందిన ఇన్ చార్జ్ మంత్రి… ఎంపీలు… ఎమ్మెల్యేలకు తెలీకుండా ఆయనకి నచ్చిన వారితో కమిటీ ఏర్పాటు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. అయితే ఈ అంశం మీద కూడా మంత్రులు రోడ్డెక్కి ఇలా వ్యాఖ్యలు చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం మంచిది కాదు, ఇంకొన్ని నెలల్లో ఎన్నికలకి వెళ్ళాల్సిన సమయంలో ఈ విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతే అది ప్రతిపక్షాలకి వరంగా మారే అవకాసం ఉంది. ఇప్పటికయినా పార్టీ ఈ ఆధిపత్య పోరు మీద జాగ్రత్త వహించకపోతే జరగబోయే నష్టాన్ని బేరీజు వేయడం కూడా కష్టమే .