Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా క్రికెటర్లు క్రికెట్ ఆడే సమయంలోనే కాకుండా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రికెట్టే లోకంగా బతుకుతారు. ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోరు. కోచ్ గానో, కామెంటేటర్ గానో కాలం వెళ్లదీస్తుంటారు. ఇక కెరీర్ కొనసాగిస్తున్న క్రికెటర్లకయితే ఆటే ప్రపంచం. మహా అయితే సినిమా హీరోయిన్లతో ఎఫైర్లతో వార్తల్లో నిలుస్తుంటారు. దాదాపు అందరు క్రికెటర్లు ఇలాగే ఉంటారు. అయితే గౌతం గంభీర్ మాత్రం ఇందుకు మినహాయింపు. టీమిండియాకు ఆడే కాలంలోనూ, తర్వాతా గంభీర్ ఎంతో సామాజిక బాధ్యత కనబరుస్తున్నాడు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలపై ఆయన తరచుగా ఆవేదన వెలిబుచ్చుతుంటాడు. చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందరినో ఆలోచింపచేశాయి. తన ఇద్దరు కుమార్తెలు పెరిగిపెద్దవారవుతోంటే భయమేస్తోందని నిత్యం వార్తల్లో కనిపిస్తున్న అత్యాచారం అనే పదానికి అర్ధం ఏమిటని వారు అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని నిర్వేదం వ్యక్తంచేశాడు. తాజాగా మేధావులంతా స్పందించడానికి నిరాకరించే కాశ్మీర్ ఉద్రిక్త పరిస్థితులపై గంభీర్ గళం విప్పాడు.
రిపబ్లిక్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ఆదిత్యరాజ్ కౌల్ కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్లు రువ్వుతున్న ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. శ్రీనగర్ లో ని నౌహట్టాలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లలో ఎలా దాడిచేస్తున్నారో చూడండి. ఆ జిప్సీ తలుపులు తెరిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాశ్మీర్ లోని ఏ మీడియా సైతం దీన్ని బయటకు చూపించదు…అని ట్వీట్ చేశాడు. ఈ వీడియోపైనా, ఆదిత్యరాజ్ చేసిన ట్వీట్ పైనా గంభీర్ స్పందించాడు. తట్టుకోలేకపోతున్నా…రాళ్లదాడి చేసే వారితో ఇంకా చర్చలు జరిపేందుకు అవకాశముందని భారత్ భావిస్తోందా…ఒక్కసారి వాస్తవపరిస్థితి గ్రహించండి. రాజకీయమద్దతు ఇవ్వండి. నా సైనిక దళాలు, నా సీర్పీఎఫ్ సత్తా ఏమిటో, ఫలితాలేమిటో చూపిస్తాయి. నా దగ్గరో పరిష్కారం ఉంది. కాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఓ వారం పాటు ఎలాంటి రక్షణా లేకుండా వారి కుటుంబాలతో నివసించాలి. ఆ తర్వాతే వారిని 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలి. అప్పుడే వారికి సైనికదళాల బాధలేమిటో, అసలు కాశ్మీర్ అంటే ఏమిటో తెలుస్తుంది అని ట్వీట్ చేశాడు. ఇప్పుడే కాదు ఎన్నో సందర్బాల్లో గౌతంగంభీర్ సైనికులకు నైతిక మద్దతు ఇచ్చాడు.
అలాగే ఆయన మాటలకే పరిమితమైన మనిషి కాదు. దాతృత్వంలోనూ ముందున్నాడు. సుక్మాలో నక్సల్స్ దాడిలో కన్నుమూసిన జవాన్ల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. జాతీయ, సైనిక, రాజకీయ సమస్యలపై ఎప్పుడూ తన గళం వినిపించే గౌతం గంభీర్ వంటి వ్యక్తుల మాటలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. కాశ్మీర్ విషయంలో గంభీర్ ఇచ్చిన సలహా ఆయన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు…దేశం యావత్తూ ఇదే ఫీలింగ్ లో ఉంది. కాశ్మీర్ లో జరిగిన రాళ్లదాడిలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ చనిపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ అక్కడి పరిస్థితి అదుపులోకి రాలేదు. కొందరు ఉగ్రవాదుల అండతో స్థానికులు కొనసాగిస్తున్న దాడులన్నీ సైనికుల లక్ష్యంగా సాగుతున్నాయి. దీంతో జవాన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సైనికుల దుస్థితిపై గంభీర్ పాటు దేశమంతా ఆవేదన వ్యక్తంచేస్తోంది.