Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గజల్ శ్రీనివాస్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన గజల్స్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గజల్ శ్రీనివాస్… ఇంత బతుకూ బతికి అన్న చందంగా ఈ వయసులో లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకోవడం తీవ్ర చర్చనీయాంశమయింది. సామాజిక సందేశాలు, స్ఫూర్తిదాయక మాటలు ఆయన పాటల్లో ప్రతిఫలిస్తుంటాయి. కానీ ఆయన వ్యవహారశైలి మాత్రం అందుకు భిన్నం అన్న విషయం వెలుగుచూసింది. తనపై ఆరోపణలు చేస్తున్న యువతిని కన్నకూతురిలా చూసుకున్నానన్న వ్యాఖ్యలు ఎంత అసత్యాలో మీడియా చేతికి చిక్కిన ఆయన వీడియోలు గమనిస్తే అర్ధమవుతుంది. తన భుజానికి మాత్రమే ఓ యువతి మందు రాసిందని, ఇంకేమీ జరగలేదని ఆయన చెబుతోంటే వీడియోలోని దృశ్యాలు మాత్రం బాధిత యుతి చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గజల్ శ్రీనివాస్ గురించి తాను ఎవరికి చెప్పినా నమ్మబోరని, అందుకే సాక్ష్యాలన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదుచేశానని బాధిత యువతి చెబుతోంటే ఆయన మాత్రం మరోరకం వాదన వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని గజల్ శ్రీనివాస్ వ్యతిరేకించారు. లగడపాటి రాజగోపాల్ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా గజల్ శ్రీనివాస్ ఆలపించిన ఇదే తెలుగువాడ సమైక్య గీతం ఊరూవాడా మార్మోగింది. చానళ్లన్నీ ఆ పాటను పదే పదే ప్రసారం చేశాయి. సమైక్య భావం ఏపీ ప్రజల్లో విస్తృతస్థాయిలో వ్యాపించడానికి ఆ గీతం ఎంతో దోహదం చేసింది. లగడపాటి కార్యాచరణ, గజల్ గీతం ఫలితాన్నివ్వకపోయినప్పటికీ పోరాటం మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. అయితే ఇప్పుడు తనపై లైంగిక వేధింపులకు, సమైక్యపోరాటానికి ముడిపెడుతూ గజల్ శ్రీనివాస్ వ్యాఖ్యాలు చేస్తుండడం కలకలం రేపింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రం కోసం పోరాడడంతో పాటు, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను కూడా వ్యతిరేకించడం వల్లే… తనకు ఈ దుర్గతి పట్టిందని గజల్ శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తున్నారట. తనపై కక్ష సాధించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరికించిందిన సన్నిహితులతో ఆయన చెబుతున్నట్టు సమాచారం.
అయితే మరికొందరు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. గజల్ శ్రీనివాస్ కన్నా ఎక్కువగా లగడపాటి సమైక్యరాష్ట్రం కోసం పోరాడారని, ఆయన ఇటీవల తన కుమారుడి వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రితో పాటు సీఎం కార్యాలయంలోని ఇతర అధికారులు సైతం ఆయన్ను సాదరంగా ఆహ్వానించిన సంగతిని గుర్తుచేస్తున్నారు. లగడపాటి సైతం తనకు లభించిన ఆదరాభిమానలు చూసి ఆశ్చర్యపోయినట్టూ వార్తలొచ్చాయి. రాజగోపాల్ నే ఆదరించిన తెలంగాణ ప్రభుత్వం గజల్ శ్రీనివాస్ పై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించే అవకాశం లేదని, ఇది ఆయన స్వయంకృతాపరాధమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.