Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాజకీయాల్లో ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరిదీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. ఒక చోటు నుంచే ఇద్దరి రాజకీయ ప్రస్ధానం ప్రారంభం అయ్యింది. అయితే కాలక్రమంలో దారులు మారాయి. స్నేహితులుగా వున్న వాళ్ళు రాజకీయ ప్రత్యర్ధులయ్యారు. ఆపై రాజకీయ శత్రువులయ్యారు. అంతకు మించి వ్యక్తిగత వైరం కూడా పెంచుకున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వారిద్దరూ మాత్రమే కాదు. వారిని అభిమానించే వాళ్ళ మధ్య ఇదే పరిస్థితి. వై.ఎస్ అంటే వీరాభిమానం వున్నవాళ్లు చంద్రబాబు అంటే కారాలు, మిరియాలు నూరుతారు. ఇక బాబును అభిమానించే వాళ్ళు వై.ఎస్ మీద మండిపడతారు. ఎక్కడైనా ఎన్టీఆర్, వై.ఎస్ ను అభిమానించే వాళ్ళు కనపడతారు. ఎన్టీఆర్, చంద్రబాబును కలిపి అభిమానంగా చూసే వాళ్ళుంటారు. కానీ వై.ఎస్, చంద్రబాబును ఇష్టపడేవాళ్లు కనపడరు.
ఇన్నాళ్టకు వై.ఎస్, చంద్రబాబును ఇద్టపడేవాళ్లు ఒకరు ముందుకొచ్చారు. ఆమె మరోవరో కాదు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ లోకి మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాక ఆమె గొంతు విప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డ వై.ఎస్ మీద అభిమానంతో జగన్ పెట్టిన వైసీపీ లో చేరినట్టు ఈశ్వరి చెప్పారు. అయితే డబ్బు రాజకీయాలు చేస్తున్న జగన్ ను భరించలేక అభివృద్ధి లక్ష్యంతో పని చేస్తున్న చంద్రబాబు దగ్గరకు చేరినట్టు ఆమె వివరించారు. ఆమె మామూలుగా ఈ విషయాలు చెప్పినప్పటికీ వై.ఎస్, చంద్రబాబు ను ఒకే విధంగా అభిమానించే నాయకులు ఉండడం విశేషమే.