Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రముఖుల జయంతి, వర్ధంతుల సమయంలో ప్రత్యేక డూడుల్ ఏర్పాటుచేసి వారికి నివాళి అర్పిస్తోంది. ఈ తరం వారికి తెలిసిన ప్రముఖులతో పాటు…. చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని ప్రస్తుతం మరుగున పడ్టవారిని కూడా డూడుల్ రూపంలో గౌరవించి అందరికీ గుర్తుచేస్తోంది. గూగుల్ డూడుల్ ద్వారా నేటి యువత తమ జీవితాలతో ఇతరులను ప్రభావితం చేసిన అనేక మంది ప్రముఖుల గురించి, చరిత్రలో ప్రత్యేకస్థానం సంపాదించిన సంఘటనల గురించి విలువైన సమాచారం తెలుసుకుంటోంది. ఆ తరహాలోనే ఈ రోజు ప్రత్యేకతను వివరిస్తూ గూగుల్ ఓ డూడుల్ రూపొందించింది. భారత తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై వ్యారావాలా 104వ జయంతి సందర్భంగా ఇవాళ ఆమెపై డూడుల్ తయారుచేసింది గూగుల్.
ముంబైకి చెందిన సమీర్ కులవూర్ ఈ డూడుల్ ను డిజైన్ చేశారు. తన కెరీర్ లో ఎన్నో కీలకఘట్టాలను కెమెరాలో బంధించిన హోమై 1913 డిసెంబర్ 9న గుజరాత్ లోని నవసారి ప్రాంతంలో జన్మించారు. అప్పటిదాకా పురుషులకే తప్ప, మహిళలకు ప్రమేయం లేని ఫొటోగ్రఫీలో అడుగపెట్టి దేశంలో తొలి మహిళా ఫొటో జర్నలిస్టుగా సంచలనం సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందూ తరువాతా కూడా ఎన్నో సంఘటనలకు దృశ్యరూపం కల్పించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫొటో జర్నలిస్ట్ గా హోమై కెరీర్ ప్రారంభమైంది. తర్వాత 1942లో బ్రిటిష్ ఇన్ ఫర్మేషన్ సర్వీస్ లో ఉద్యోగిగా చేరారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫొటోగ్రాఫర్ మానెక్ షా వ్యారవాలాను పెళ్లిచేసుకున్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ జెండాను కిందకి దించి పార్లమెంట్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన అద్భుత ఘట్టాన్ని హోమై తన కెమెరాలో బంధించారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖ నాయకుల మొదటి ఫొటోలను తీసింది కూడా హోమైనే. అలాగే 1959లో దలైలామా సరిహద్దు దాటుతున్న దృశ్యం కూడా హోమై కెమెరాలో నిక్షిప్తమయింది. ఇలా తన వృత్తిలో భాగంగా ఎన్నో అరుదైన సంద్భాలను ఫొటోల రూపంలో అందరికీ చూపించారు హోమై. 1973లో భర్త మరణించిన తరువాత ఆమె ఫొటోగ్రఫీని వదిలిపెట్టారు. ఏకైక కుమారుడు కూడా 1989లో క్యాన్సర్ తో కన్నుమూయడంతో హోమై ఒంటరితనంలో కూరుకుపోయారు. కొడుకు చనిపోయిన తర్వాత బరోడాలో చిన్న అపార్ట్ మెంట్లో ఆమె కాలం వెళ్లదీసారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2012 జనవరి 15న 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు.