గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ అరగంట పాటు ప్రధానితో భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, భూరికార్డుల ప్రక్షాళన అంశాలు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పోలవరం ప్రాజెక్టు పనుల అంశాలను గవర్నర్ చర్చించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. ఇటీవల తనను కలిసిన ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తంచేశారని గవర్నర్ ప్రధానికి తెలియజేశారు. అటు నరసింహన్ మోడీతో భేటీ అయిన రోజే… ఆయనకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలు గళమెత్తారు. నరసింహన్ ను తొలగించి బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్ ను నియమించాలని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. నరసింహన్ ఏపీ బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారని, గవర్నర్ వల్ల ఏపీకి ఏమీ ప్రయోజనం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నివాసానికి అనువైన వసతులు లేవని ఏపీకీ రాలేకపోతున్నారా అని ఎద్దేవాచేసిన విష్ణుకుమార్ రాజు గవర్నర్ కనీసం వారం రోజులైనా ఏపీలో ఉన్నారా, ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా అని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితుల్ని ప్రధానికి వివరించిన గవర్నర్
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]