Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసమని ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఊహించని విధంగా తన పర్యటన రద్దు చేసుకొని తిరుగుముఖం పట్టారు. రెండు రోజుల పర్యటనకు మంగళవారం ఢిల్లీ వచ్చిన నరసింహన్ బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. ఈ మేరకు ఆయనకు వారందరితో అపాయింట్మెంట్లు సైతం ఖరారయ్యాయని తెలుస్తోంది. కారణాలేమిటో తెలియదు కానీ అనూహ్యరీతిలో గవర్నర్ నరసింహన్ తన పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్లు సైతం ఖరారు చేసుకొని రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి ఎవరినీ కలవకుండానే బుధవారం ఉదయాన్నే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకపంపనలు సృష్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు నరసింహన్ ఢిల్లీ వచ్చారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణా సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు, మరోవైపు ఏపిలో విభజన హామీలపై చంద్రబాబు విన్నపాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు గవర్నర్ నరసింహన్ సంసిద్ధమై వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కొద్దిరోలుజుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈనెల 20న విజయవాడలో ధర్మ పోరాట దీక్ష నుంచి కేంద్రంపై దూకుడు మరింత పెంచారు. ఈ దీక్ష తర్వాత గవర్నర్ నరసింహన్ చంద్రబాబును విజయవాడలో కలిసి చర్చించారు. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నరసింహన్‌తో భేటీ అయ్యారు.
అయితే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం నరసింహన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన తరువాత విమానాశ్రయం నుంచే వేరేచోటికి వెళ్లిపోయారని ఆయన కేవలం తన లగేజీని ఏపీ భవన్‌కు పంపించి తాను మాత్రం గంటన్నరపాటు ఎవరికీ అందకుండా వెళ్లిపోయారట. ఆ గంటన్నర సమయంలోనే ప్రధాని నివాసానికి వెళ్లి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మోదీకి సమగ్ర నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఆంధ్రలో రాజకీయ పరిస్థితి, సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ పరిస్థితి, పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్ల యుద్ధం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెదేపా పార్టీ, ప్రభుత్వం చేస్తున్న ఎదురుదాడి తదితర అంశాలు వివరించారని సమాచారం. మధ్యప్రదేశ్ పర్యటన ముగించుకుని కొంత ఆలస్యంగా ఢిల్లీకి వచ్చిన మోదీ నరసింహన్ ని కలిసారని అలాగే ముందు నిర్ణయించినట్టుగా కాక బుధవారం ఉదయమే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారని సమాచారం, అయితే ఈ విషయాన్ని ఏపీ భవన్ అధికారులు ధ్రువీకరించటం లేదు.
గవర్నర్ బయటికి వెళ్ళడం అయితే నిజమే కానీ, ఎక్కడికెళ్ళారు అనేది తమకి తెలియదని వెళ్లివచ్చిన తర్వాత కొద్దిసేపు ఏపీ భవన్లో గడిపిన అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమయ్యారని ఏపీ భవన్ అధికారులు అంటున్నారు. అయితే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్ళీ వెళ్లడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన రద్దవడం బట్టీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చంద్రబాబు వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ సమయంలో కేంద్ర పెద్దలను తాను కలిసిన విషయం బయటకి వస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనే వారిని రహస్యంగా కలిసి అసలు పర్యటనే రద్దయ్యింది అని మీడియా, ప్రజలు భావించాలని ఆయన ఇలా చేసి ఉండచ్చు అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ దొంగచాటు వ్యవహారాలు చూస్తే చంద్రబాబు చేస్తున్న కుట్ర ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు ఇంతలా ప్రయత్నించడం చూస్తే చంద్రబాబు మీద మోడీ ఎంత పగ బట్టారో అర్ధమవుతోంది.