ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ మధ్య సంబంధాలు బాగా లేవని చెప్పేందుకు బోలెడు ఉదాహరణలు వున్నాయి. అందుకే గడిచిన రెండేళ్లలో ఆ ఇద్దరు అత్యవసరం అయితే తప్ప ఎదురుపడడం లేదు. గవర్నర్ స్థానంలో వున్నారు కాబట్టి నరసింహన్ బహిరంగంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏ వ్యాఖ్య చేసినట్టు లేదు. అయితే చంద్రబాబు ఒకటిరెండు సందర్భాల్లో నేరుగా నరసింహన్ పేరు ఎత్తకపోయినా ఆయన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ వ్యవస్థ గురించి చెప్పిన సందర్భాలు వున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నరసింహన్ తెలంగాణాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న వాదనలు కూడా బలంగా వినిపించాయి. దీంతోపాటు ఆంధ్రాలో పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసి తనను గైడ్ చేయడంలో నరసింహన్ సక్సెస్ కాలేకపోయారని కేంద్రం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ గా నరసింహన్ కొనసాగింపు కష్ఠమే అన్న టాక్ వినిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో గవర్నర్ నరసింహన్ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ , ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వీరి ఆరోగ్యం గురించి ఆందోళనతో నరసింహన్, చంద్రబాబుకి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది. అయితే కడప తో పాటు యావత్ ఆంధ్ర ప్రజల కోరిక అయిన ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి కేంద్రానికి నివేదించి అది సుసాధ్యం చేసేసేలా చూడాలని చంద్రబాబు, నరసింహన్ ని కోరారట. ఆ విషయంలో స్పష్టత ఇవ్వడానికి ఇబ్బందిపడ్డ నరసింహన్ సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం గురించి ఇంకోసారి ప్రస్తావించి ఫోన్ పెట్టేసినట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ దీక్షతో జనంలో ఉక్కు ఫ్యాక్టరీ సెంటిమెంట్ బలపడుతుందని భావించిన కేంద్రమే గవర్నర్ తో ఫోన్ చేయించిందని కూడా టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి.