Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సర్వంగా సుందరంగా ముస్తాబు చేసిన మిథిలా ప్రాంగణంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం పూర్తయింది. అభిజిత్ లగ్నం సుముహూర్తంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టుకున్నారు. అనంతరం జానకీదేవి మెడలో రాముల వారు మాంగళ్యధారణ చేశారు. ఈ సారి సీతారాముల కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించిన సంవత్సరం విలంబినామ సంవత్సరం. 1958లో విలంబినామ సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగింది. తిరిగి మళ్లీ 60 ఏళ్ల తర్వాత విలంబినామ సంవత్సరంలో రాములవారూ, సీతమ్మతల్లీ ఒక్కటయ్యారు.
సీతారాములవారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించింది. అసలయితే ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంతో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈవో శ్రీనివాసరావు, డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చింది. కిలోమీటర్లు మేర భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. సీఎం కుటుంబసభ్యులు కళ్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.