తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రూపొందింది. మనదేశంలోనే కాకుండా విదేశాలలోను ఈ రెండు పార్ట్‌లకి మంచి ఆదరణ లభించింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితర నటులు ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందారు. ఆర్కే మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఈ చిత్రాన్ని వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా పలుమార్లు వీక్షించారు బాహుబలి లవర్స్. మరి ఇలాంటి సందర్భంలో చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకి అదొక తుగ్లక్ ఆలోచన అవుతుందని పలువురి నుండి వినిపిస్తున్న సమాధానంగా తెలుస్తుంది.
అయితే గుజరాతీ నిర్మాతలు నితిన్ జానీ, తరుణ్ జానీ మాత్రం బాహుబలి చిత్రాన్ని తప్పక రీమేక్ చేస్తామని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్ర రీమేక్ హక్కులు కూడా వారు పొందినట్టు సమాచారం. గతంలో వీరు గుజరాతీ భాషలో మంచి హిట్ సినిమాలు తీసారు. అయితే తక్కువ బడ్జెట్‌తో సినిమాని రీమేక్ చేసినప్పటికి అనుకున్నంత వసూళ్ళు రాకపోవడంతో పాటు సినిమాకి అంతగా ఆదరణ లభించదని సగటు ప్రేక్షకుడి వాదనగా తెలుస్తుంది. గత ఏడాది బాహుబలి చిత్రాన్ని వీర్ యోధ మహాబలి పేరుతో భోజ్‌పురి భాషలో రీమేక్ చేశారు. దినేష్ లాల్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించగా, ఇక్బాల్ బక్ష్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అంతగా ఆదరణ పొందని విషయం తెలిసిందే.