Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు సీబీఐ కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. రోహ్తక్ జైలులో ఏర్పాటుచేసిన ఓ ప్రత్యేక గదిలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్దీప్సింగ్ ఈ శిక్షను ఖరారు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభమయింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించేందుకు న్యాయమూర్తి పదినిమిషాల సమయం ఇచ్చారు. గుర్మీత్ తరపు లాయర్ ఆయన్ను ఓ సామాజిక కార్యకర్తగా అభివర్ణించారు. ప్రజల కోసం గుర్మీత్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించాలని కో్రారు.
ఈ వాదనలను ప్రాసిక్యూషన్ తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా కఠిన శిక్ష విధించాలని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ జగ్దీప్సింగ్ గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చదివి వినిపించారు. కోర్టుగదిలో గుర్మీత్ భావోద్వేగానికి లోనయినట్టు తెలుస్తోంది. చేతులు కట్టుకుని నిల్చున్న గుర్మీత్ కన్నీరుపెట్టుకుంటూ తనపై దయచూపాలని సీబీఐ న్యాయమూర్తిని కోరాడు. తనను క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. కో్ర్టు హాలు నుంచి బయటకు రానంటే రానని పట్టుబట్టాడు. దీంతో పోలీసులు ఆయన్నుబలవంతంగా బయటకు తీసుకొచ్చారు.
అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… హర్యానాలో మళ్లీ అల్లర్లు చెలరేగుతున్నాయి. డేరా బాబాకు పదేళ్ల శిక్ష విధించారని తెలియగానే ఆయన అనుచరులు రెచ్చిపోయారు. సిర్సా, పుల్కా ప్రాంతాల్లో ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పంటించారు. ఆందోళనలు అదుపులోకి తెచ్చేందుకు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు భారీగా పోలీసుల్ని మోహరించాయి. కేంద్ర బలగాలూ రంగంలోకి దిగాయి. మరోవైపు డేరా బాబాకు పదేళ్ల జైలు శిక్ష సరిపోదని, ఉరిశిక్ష వేయాలని ఉత్తరప్రదేశ్ లో కొందరు సాధువులు డిమాండ్ చేశారు. వారణాసిలో ఆందోళన నిర్వహించిన సాధువులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గుర్మీత్ ను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు: