ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. అక్రమాలు చేస్తున్న కంపెనీలు, సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేస్తుంటే టీడీపీ కుట్ర జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు జీవీఎల్. ఏకంగా రాష్ట్రంపై దాడి జరుగుతున్నట్లుగా చిత్రకరిస్తున్నారన్నారు. తప్పు చేయనప్పుడు ఐటీ సోదాలంటే భయమెందుకని ప్రశ్నించారు. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కక్ష సాధింపు చర్యలనడం ఏంటని ప్రశ్నించారు జీవీఎల్. గతంలో కొన్ని పార్టీలపై ఐటీ దాడులు జరిగితే శభాష్ అన్న టీడీపీ నేతలు తమదాకా వచ్చేసరికి భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రాధమికంగా ఆధారాలు లేకుండా ఐటీ శాఖ సోదాలు జరపదని ఆ సమాచారం ఉంది కాబట్టే దాడులు జరుగుతున్నాయన్నారు. ఐటీ సోదాలపై మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపైనా జీవీఎల్ స్పందించారు. బినామీ ఆస్తులు అయినందుకే లోకేష్ స్పందిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్‌లు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ రూ.500కోట్లు ఇచ్చిందని అదంతా అవినీతి సొమ్మేనని అన్నారు. మంత్రి లోకేష్ కూడా బినామీ ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ వ్యాఖ్యలతో సీఎం రమేష్ బినామీ అని తెలిపోయిందన్నారు.
దీక్ష చేసినందుకే కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోదని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు బీజేపీ ఎంపీ. ఉక్కు పరిశ్రమ పేరుతో కడపలో ఆయన చేసింది దొంగ దీక్ష అని. అక్రమార్జనపై వచ్చిన ప్రశ్నలకు సీఎం రమేష్ సమాధానం చెప్పాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్, మెకాన్‌కు సమాచారం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వమే ఆలస్యం చేసిందని త్వరలోనే కడప ఫ్యాక్టరీ నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.